వివిధ పార్టీల నుంచి నేతలు కూడా భారీగా బీఆర్ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన మీటింగ్‌లో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. జడ్పీచైర్మన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతలు.. గులాబీ కండువా కప్పుకున్నారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో ముందుకెళుతున్న కేసీఆఱ్.. దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరంటూ.. నాందేడ్ సభలో జనాలను ఇన్‌స్పైర్ చేసే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రకు తనను రావొద్దు అనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ తరహా అభివృద్ధి చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని.. దమ్ముంటే రైతుబంధు, దళితబంధు, 24గంటల కరెంట్, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా.. రైతులకు మేలు జరగటం లేదని విమర్శలు గుప్పించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని.. ప్రతీ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఐతే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఐతే తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలపై మాత్రం కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ప్రభావం కనిపించడం దాదాపు అసాధ్యమే! బీజేపీతో పాటు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీలు మహారాష్ట్రలో ఉన్నాయ్. అలాంటి పార్టీలను కాదని బలం పెంచుకొని.. మహారాష్ట్రలో కారు పార్టీ జోరు చూపించడం సాధ్యం కాని పనే !