KCR on Farmers: అదే స్ట్రాటజీ ! వాళ్ళు ఓట్లేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా..?

కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనీ.. కర్ణాటకలో 5 గంటలకు మించి ఉండటం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఉంటే, కాంగ్రెస్ వస్తే 5 గంటలే అని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటోంది.. అది తీసేస్తే రైతుబంధు రాదని కేసీఆర్ భయపెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 01:03 PM IST

KCR on Farmers: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఇంకా వారం రోజుల్లో క్యాంపెయిన్ ముగుస్తోంది. దాంతో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున తిరుగుతూ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. రెండో దఫా ఎన్నికల ప్రచారం చేపట్టాక ఆయన కొంత స్ట్రాటజీ మార్చారు. రైతులు, ఫించన్ దారులపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఈ వారం రోజులు చాలా కీలకం. అందుకే అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. ప్రచారంలోనూ ముందే ఉన్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలను చుడుతున్నారు. ఇప్పటికి 74కు పైగా స్థానాలను ఆయన కవర్ చేశారు. ప్రతి సభలోనూ రైతుల గురించే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ధరణి, ఉచిత కరెంట్, రైతు బంధు చుట్టే సీఎం కేసీఆర్ ప్రసంగం తిరుగుతోంది.

Chandrababu Case: రెండు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనీ.. కర్ణాటకలో 5 గంటలకు మించి ఉండటం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఉంటే, కాంగ్రెస్ వస్తే 5 గంటలే అని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటోంది.. అది తీసేస్తే రైతుబంధు రాదని కేసీఆర్ భయపెడుతున్నారు. ధరణి ఎత్తేస్తే రైతుల భూములు మళ్ళీ ఇతరుల చేతుల్లోకి వెళ్తాయనీ, రెవెన్యూ అధికారులు దోపిడీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ధరణి ఉండాల్నా వద్దా అని జనాన్ని అడుగుతూ వారిలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇది కాకుండా రైతుబంధును 16 వేల దాకా తీసుకెళ్తామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. నిరుద్యోగులు, ఉద్యోగులు ఇంకా కొన్ని వర్గాల వారి నుంచి వచ్చే వ్యతిరేకతను రైతుల ఓట్లతో బ్యాలెన్స్ చేయాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఓట్లు 70 లక్షల దాకా ఉన్నాయి. ఆ మొత్తం ఓట్లను కారు గుర్తుకు మళ్ళిస్తే, ఫించన్ దారులు, పార్టీ అభిమానుల ఓట్లతో 80కి పైగా సీట్లు రావడం ఖాయమనీ, హ్యాట్రిక్ కొడతామన్న భరోసా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా రైతులపైనే మాట్లాడుతున్నారు.

ఫించన్లు 5 వేలకు పెరుగుతాయని ఆశ చూపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు దాదాపు 97 లక్షల ఓట్లు పడ్డాయి. దాంతో 46 శాతం ఓట్ల సాధించిన BRS… 83 సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు 70 లక్షల మంది రైతుబంధు డబ్బులు అందుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులంతా కలిపి రెండు కోట్ల మంది వరకు ఉంటారు. అందులో సగం ఓట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చినా మళ్ళీ తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెబుతున్నారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల్లో అవినీతి, ప్రభుత్వ పథకాలు అందడం లేదని విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా… కేసీఆర్ మాత్రం వాటిని ఖండించే ప్రయత్నం చేయట్లేదు. తనకు రైతుల అజెండాయే ముఖ్యం అన్నట్టు సాగుతోంది ఆయన ప్రచారం. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, రైతుబంధు రాదు, ధరణి పోతే భూములు ఆగమవుతాయి అనే భయాలను రైతుల్లో కలిగిస్తున్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మళ్ళీ రైతులు వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారా అన్నది డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో తేలనుంది.