Kokapet Land: చవకగా బీఆర్ఎస్‌కు భూ సంతర్పణ.. అధికారం ఉంటే అడ్డగోలుగా దోచిపెడతారా?

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల భూమిని తమ పార్టీ కోసం కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. శుక్రవారం భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 06:03 PM IST

Kokapet Land: ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన తెలంగాణ ప్రభుత్వం అవే భూముల్ని కారుచౌకగా కొట్టేస్తోంది. సొంత పార్టీకి తక్కువ ధరలోనే రహస్యంగా భూమి కేటాయించింది. దాదాపు రూ.500 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కోకాపేటలోని భూమిని రూ.37 కోట్లకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వందల కోట్ల విలువైన భూమిని సొంత పార్టీకి అతి చవకగా కేటాయించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సామాన్యులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల్లోనే కేటాయింపు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల భూమిని తమ పార్టీ కోసం కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ సెంటర్ పెడతామని దరఖాస్తులో పేర్కొంది. దీనికి ఈ నెల 16న సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపారు. అక్కడ్నుంచి తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫైల్ కదిలింది. దీనికి గత గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. శుక్రవారం భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 11 ఎకరాల విస్తీర్ణం.. కోట్ల విలువైన భూమి కేటాయింపు ఒకే వారంలో పూర్తవడం విశేషం. సాధారణంగా ఇలాంటి భూముల కేటాయింపు కోసం నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది.

అధికార పార్టీ కోసం స్థలం కాబట్టి వారంలోనే ఆమోదం లభించింది. ఇక కోకాపేటలో ఎకరాకు రూ.50 కోట్లకుపైగానే విలువ ఉంటుంది. ఈ లెక్కన 11 ఎకరాలకు రూ.550 కోట్లకు పైగానే రావొచ్చు. బహిరంగ మార్కెట్లో అంతకంటే ఎక్కువ విలువే ఉంటుందని అంచనా. అంత విలువైన భూమిని రూ.37.53 కోట్లకు కేటాయించడం విశేషం. అంటే గజం రూ.లక్షా పదివేల రూపాయల విలువ ఉండగా, రూ.7,500కే కేటాయించారు. అలాగని ఈ భూ కేటాయింపు వివరాల్ని ప్రభుత్వం నేరుగా వెల్లడించలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం అనేక విషయాల్ని మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. కానీ, బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై మాత్రం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా విషయం బయటపడింది.


పేదల ఇండ్లకు స్థలం లేదు.. పార్టీకి మాత్రం..
ప్రభుత్వ భూమి అంటే ప్రజలది. అది ప్రజలకు ఇండ్లు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వినియోగించాలి. లేదా నిర్ణీత ధరతో పరిశ్రమలు, సంస్థల స్థాపనకు కేటాయించాలి. దీని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ప్రజా సంక్షేమం కోసం వినియోగించాల్సిన అలాంటి భూమిని పార్టీకి కేటాయించడంపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అనేక చోట్ల భూముల్ని వేలంపాట ద్వారా విక్రయిస్తూ బడాబాబులకు కట్టబెడుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూమే లేకుండా చేస్తోంది ప్రభుత్వం. పేద ప్రజలకు ఇండ్లు నిర్మించేందుకు మాత్రం స్థలం లేదని చెబుతోంది. అనేక చోట్ల ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉండగా, సరైన స్థలం దొరకడం లేదనే కారణంతో ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం లేదు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు నిధులు సరిపోవడం లేదంటోంది. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తాం అని చెప్పిన ప్రభుత్వం దీనికి సరిపడా భూములు రాష్ట్రంలో లేవని చెప్పి, ఈ పథకాన్నే అమలు చేయడంలేదు. కానీ, సొంత పార్టీకి మాత్రం కోట్ల విలువైన భూమిని అతి తక్కువ ధరకే కట్టబెట్టింది.
అధికార దుర్వినియోగం కాదా?
బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపు కచ్చితంగా అధికార దుర్వినియోగమే. వందల కోట్ల విలువైన భూమిని పది శాతం కంటే తక్కువకే కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం అధికారి దుర్వినియోగానికి పాల్పడింది. దీనిపై బీజేపీసహా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం అక్కడి జిల్లా కలెక్టర్లు కారు చవకగా కేటాయించారు. ఇప్పుడు కోకాపేటలోని విలువైన భూములను బీఆర్ఎస్‌ కొట్టేసిందని విమర్శించారు. జీవో 111 రద్దు ద్వారా కూడా లక్ష కోట్ల స్కాంకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు.

111 జీవో రద్దు ద్వారా అక్కడి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం తెరలేపిందన్నారు. గతంలో, ఉమ్మడి ఏపీలో తిరుమలగిరి మండలం బోయిన్​పల్లిలోని 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలో కాంగ్రెస్​ పార్టీకి 10 ఎకరాల 15 గుంటలు కేటాయించడంపై కూడా అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా అధికారంలో ఉన్న పార్టీలు కోట్ల విలువైన భూముల్ని తమ స్వలాభం కోసం కేటాయించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇండ్లు కట్టేందుకు, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ కట్టేందుకు భూములు ఉండవు కానీ.. తమ పార్టీ నిర్మాణాలకు మాత్రం భూములు వస్తాయా అంటూ నిలదీస్తున్నారు.