KCR: శ్రావణ శుక్రవారం ముహూర్తంలో.. రాజ్ భవన్‌తో కేసీఆర్ రాజీ..!

గోల్కొండ కోట వేదికగా జరిగిన పంద్రాగస్టు వేడుకలకూ గవర్నర్‌‌ను ఆహ్వానించని కేసీఆర్ సర్కారు.. అకస్మాత్తుగా ఎందుకు చొరవ చూపి మరీ గవర్నర్‌కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోందన్నది చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 12:07 PM IST

KCR: తెలంగాణ పాలిటిక్స్‌లో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏదో సైలెంట్‌గా జరుగుతోంది. ఓ వైపు బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించే బండి సంజయ్‌కు ఇతర బాధ్యతలిచ్చారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య కూడా సయోధ్య కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను తమ ప్రధాన ప్రత్యర్ధిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఇదంతా దేనికి సంకేతం అనే టాపిక్‌పై ఇప్పుడు ప్రజల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.

గోల్కొండ కోట వేదికగా జరిగిన పంద్రాగస్టు వేడుకలకూ గవర్నర్‌‌ను ఆహ్వానించని కేసీఆర్ సర్కారు.. అకస్మాత్తుగా ఎందుకు చొరవ చూపి మరీ గవర్నర్‌కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోందన్నది చర్చనీయాంశంగా మారింది. గురువారం రోజు మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా గవర్నర్‌తో సీఎం కేసీఆర్ దాదాపు 20 నిమిషాల పాటు భేటీ కావడం, ఆ తర్వాత సెక్రటేరియట్‌కు తమిళిసైని ఆహ్వానించడం చకచకా జరిగిపోయింది. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఇవాళ (శ్రావణ శుక్రవారం) సచివాలయానికి రానున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ మీటింగ్ పైనే ఉంది.
ఓ వైపు చిన జీయర్‌తో.. మరోవైపు గవర్నర్‌తో సయోధ్య దిశగా..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సెప్టెంబరు 4న జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో పునర్నిర్మించిన ఆలయంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా సీఎం కేసీఆర్, చిన జీయర్ స్వామిలను కలిపేందుకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా సీఎం కేసీఆర్, చిన జీయర్ స్వామి ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, గవర్నర్ కలిసి పాల్గొనబోతున్నారు. ఈ ప్రోగ్రామ్‌తో సీఎం, గవర్నర్ పరిపాలనా సంబంధాలు గాడిన పడతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. స్థూలంగా చూస్తే.. ఈ రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సెంటర్ పాయింట్‌గా సీఎం కేసీఆర్ ఉన్నారనేది విస్పష్టం.
బిల్లులకు ఇక లైన్ క్లియర్..
ఒకానొక దశలో బీఆర్ఎస్ పార్టీ నేతలు.. గవర్నర్ వ్యవస్థే అవసరం లేదని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు పెద్ద గ్యాప్ తర్వాత ఒకే ప్రోగ్రామ్‌లో కలిసి పాల్గొంనడం వారి మధ్య సయోధ్య కుదిరిందనే దానికి సంకేతమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పెండింగ్‌ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం లేదంటూ రాజ్‌భవన్‌పై ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు సమీపించిన వేళ.. ఇవాళ చోటుచేసుకోనున్న పరిణామంతో గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ సహా పలు బిల్లులకు త్వరలోనే అప్రూవల్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపికకు కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుందని అంటున్నారు. గురువారం రోజు గవర్నర్‌తో సీఎం 20 నిమిషాల భేటీలో ఇవే అంశాలపై డిస్కషన్ జరిగిందని చెబుతున్నారు. ఇకపై గవర్నర్‌కు ప్రొటోకాల్‌ను కూడా రాష్ట్ర సర్కారు అమలు చేసే అవకాశాలు భారీగా ఉన్నాయి.