ASSEMBLY ELECTIONS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజులే టైమ్ ఉంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొడతామని 20 రోజుల దాకా కలలు కన్నది బీఆర్ఎస్. కానీ వేవ్ కాంగ్రెస్ వైపు మళ్ళడంతో ఈసారి ఓటమి తప్పదనే భయం కేసీఆర్, కేటీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే కనీసం ప్రకటన చేయడం.. ప్రెస్‌మీట్ పెట్టడం లాంటివి కూడా చేయని కేటీఆర్.. ఇప్పుడు ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి తెగ తాపత్రయ పడుతున్నారు. రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా సరే.. మంత్రులే TRS భవన్‌కి వచ్చి స్పందించేవారు. లేదంటే జిల్లాలో మీడియా అడిగితే సమాధానం చెప్పేవారు.
BARRELAKKA: బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించబోతున్న బర్రెలక్క.. అసలు విషయం ఇదీ..!
రాష్ట్రం మొత్తం చలించిపోయే సంఘటనలకు కూడా సీఎం కేసీఆర్ ఏనాడూ స్పందించలేదు. TSPSC లీకేజీ విషయంలో మాత్రం కేటీఆర్ మాట్లాడారు. ‘ఆ.. మాకేంటి సంబంధం.. ఎవరో TSPSC ఉద్యోగి చేస్తే.. నేనెందుకు రాజీనామా చేయాలి’.. అని మీడియా, ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. మొన్నీమధ్య ప్రవళిక ఆత్మహత్య విషయంలోనూ కేటీఆర్ స్పందించిన తీరును నిరుద్యోగులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఏమైతది.. అని తనదైన శైలిలో స్పందించే కేటీఆర్.. ఇప్పుడు ఓటమి భయంతో కాస్త దిగొచ్చారు. ఏదో రకంగా టీవీల్లో, సోషల్ మీడియాలో కనిపించాలని తెగ ఆరాట పడుతున్నాడు. అప్పట్లో మీడియాకు బైట్ ఇయ్యడానికి కూడా అంత దూరంలో ఉండే కేటీఆర్.. ఇప్పుడు అడిగినోళ్ళకి.. అడగనోళ్ళకి కూడా.. రండి బాబు రండి అంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓటమి తెచ్చిన భయం ఎంత పని అయినా చేయిస్తుందంటే ఇదేనేమో. రియల్ ఎస్టేట్, ఐటీ, ఆటోయూనియన్లు, జర్నలిస్టులు, ఛానల్స్.. చివరికి గంగవ్వ, గోరేటి వెంకన్న.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎంత మందితో వీలైతే అంత మందితో ఇంటర్వ్యూలు చేయించుకొని మీడియాకు పంపుతున్నారు. వీటిల్లో చాలా మటుకు BRS పార్టీ షూట్ చేయించి.. మీడియాకు పేలాల్లెక్క పంచుతున్నవే ఉన్నయ్.
REVANTH REDDY: నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది: రేవంత్ రెడ్డి
మీడియా ప్రతినిధులు తమంట తాము పిలిచి ఇంటర్వ్యూలు చేసినవి రెండో, మూడో.. అంతే. మిగతావన్నీ సొంతంగా రికార్డు చేయించుకున్నవే. జేపీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, గంగవ్వ, గోరేటి వెంకన్న, టీహబ్‌లో నిరుద్యోగులతో చిట్ చాట్.. ఇలా ప్రతిదీ BRS పార్టీయే షూట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. హ్యాట్రిక్ కొడతామన్న నమ్మకం తగ్గిపోవడంతో.. తొమ్మిదిన్నర యేళ్ళల్లో తెలంగాణను ఎలా అభివృద్ధి చేశామో చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు కేటీఆర్. ఇక కేసీఆర్ అయితే సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు. BRSని గెలిపించకపోతే నాశనం అయిపోతారు అంటూ జనాన్ని భయపెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలాగా రాష్ట్రం అయిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నది తెలంగాణ వాళ్ళే కదా. అప్పటి పాలన చేయడానికి వాళ్ళేమీ ఆంధ్రవాళ్ళు కాదు కదా. అయినాసరే.. ఏదో రకంగా జనంలో భయం సృష్టించి.. మేం రాకపోతే ఏదో జరిగిపోతుంది అని హిప్నటైజ్ చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది.. బీఆర్ఎస్‌లో భయం, నిస్పృహ ఎంతగా ఉందో. ఇక డైలీ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలోనైతే కాంగ్రెస్‌తో పోటా పోటీగా యాడ్స్ కుమ్మరిస్తున్నారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మేం అంత చేశాం.. ఇంత చేశాం.. అని చెప్పుకునే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల నాయకులతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడిన తీరు చూస్తేనే అర్థమవుతోంది.. ఓటమి ముంగిట్లో బీఆర్ఎస్ నిలబడింది అని. ‘మౌత్ టాక్‌తో మనల్ని మనమే ఓడించుకోవద్దు.. ప్లీజ్ నాకోసం ఈ వారం రోజులు కష్టపడండి.. మళ్ళీ గెలిచినంక.. వారంలో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటా’.. అంటూ పార్టీ కేడర్‌ని కేటీఆర్ ప్రాధేయపడిన ఆడియో చక్కర్లు కొడుతోంది. అంతెందుకు ఓడిపోతున్నామన్న టెన్షన్.. గత పది రోజులుగా KCR, KTR, హరీష్ రావు, కవిత ముఖాల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ సమీకరణాల్లో తేడాలొచ్చి.. ప్రభుత్వ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ మళ్ళోసారి గెలవాలే తప్ప.. ప్రజామోదంతో గెలిచే పరిస్థితి అయితే కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు.