KCR గజ్వేల్‌కు కేసీఆర్ బైబై..! కొత్త సీటు వేటలో బీఆర్ఎస్ అధినేత..!!

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందనుకుంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం. అందుకే దక్షిణ తెలంగాణలో కోల్పేయే సీట్లను ఉత్తర తెలంగాణలో సాధించాలనుకుంటున్నారాయన.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 04:32 PM IST

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. నేతలందరూ సేఫ్ జోన్ కోసం వెతుక్కుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి. దీంతో నేతలందరూ ఏ సీటు నుంచి పోటీ చేయాలనే దానిపై సర్వేలు చేయించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈసారీ అసెంబ్లీ స్థానాన్ని గజ్వేల్ నుంచి మరొకచోటికి మారుస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం రెండు సీట్లను పరిశీలిస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే తన సొంత సర్వే టీమ్ లు పరిస్థితులను ఆరా తీస్తున్నాయి. అసలు కేసీఆర్ సీటు ఎందుకు మార్చాలనుకుంటున్నారు..?

2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2018లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. రెండు సార్లు సీఎం అయ్యారు. అంతకుముందు నాలుగు సార్లు సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకసారి కరీంనగర్ నుంచి మరోసారి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 1983లో టీడీపీలో చేరి తొలిసారి పోటీ చేసినప్పుడు మినహా మరెప్పుడూ కేసీఆర్ ఓటమి చవిచూడలేదు. గజ్వేల్ నుంచి ఎన్నికయ్యాక ఆయన సీఎం అయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఆయన గజ్వేల్ నుంచి కాకుండా పెద్దపల్లి లేదా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

కామారెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గాలు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కు ఆయువుపట్టు. దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వస్తుంటాయి. మొదటి నుంచి కేసీఆర్ పార్టీని ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మరోసారి తమకే ఇక్కడి ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నారు. అయితే ఈసారి ఇంతకుముందు లాగా ఏకపక్షంగా సీట్లు రావని భావిస్తున్నారు కేసీఆర్. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందనుకుంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం. అందుకే దక్షిణ తెలంగాణలో కోల్పేయే సీట్లను ఉత్తర తెలంగాణలో సాధించాలనుకుంటున్నారాయన. తాను ఉత్తర తెలంగాణలోని ఏదైనా స్థానం నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం ఆ ప్రాంతం మొత్తంమీద పడుతుందనుకుంటున్నారు. అందుకే ఆ రెండు సీట్లలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.