యుద్ధంలో రెండు ఎత్తులు ఉంటాయ్.. మన బలం పెంచుకోవడం ఒకటయితే.. ప్రత్యర్థి బలహీనతను ఆయుధంగా చేసుకోవడం రెండోది ! ప్రతీ యుద్ధంలో రాజకీయం ఉంటుంది.. రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. అలాంటి రాజకీయంలో యుద్ధానికి మించిన వ్యూహాలు కనిపిస్తుంటాయ్. రాజకీయాల అంతు చూసేసిన కేసీఆర్‌కు.. పక్కాగా తెలిసిన విషయం ఇది ! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఆలోచన మొదలైనప్పుడే.. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వీళ్లు కాకపోతే వాళ్లు అనుకున్నప్పుడే.. ఫలితంలో ఛేంజ్ ఉంటుంది.
అలాంటి ఆలోచనల మీద, మార్పు మీదే కేసీఆర్ పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈజీ అర్థం అయ్యేలా చెప్పాలంటే.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం లేకుండా స్ర్టాటజీలు రచిస్తున్నారు. 2018ఎన్నికల్లో చేసింది అదే.. ఇప్పుడు చేయబోయేది అదే ! బీఆర్ఎస్ ఇంత బలంగా మారిందంటే.. మరింత బలంగా ముందుకు వెళ్తుందంటే.. ఆ వ్యూహమే కారణం ! 2018తర్వాత కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలం అయింది. ఒక్క దెబ్బకు కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చింది చేరింది. హస్తం పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడిప్పుడు ! గతంతో కంపేర్ చేస్తే.. బీజేపీ బలం భారీగా పుంజుకున్నా.. ఇప్పటికిప్పుడు అధికారం దక్కించుకునే స్థాయిలో లేదు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
బీఆర్ఎస్ కాకుండా అధికారంలోకి ఎవరు అనే ఆలోచన కూడా రాకుండా పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడు లేరు. రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్న తర్వాత.. పార్టీలో కాస్త జోరు కనిపించిందని అనిపించినా.. సీనియర్ల వ్యవహారంలో మళ్లీ వెనకే ఉండిపోయింది. మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోంది. సీనియర్లు ఒకవైపు.. రేవంత్ రెడ్డి మరోవైపు.. ఈ మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నాయ్. ఎటు వైపు ఉండాలో.. ఏం తేల్చుకోవాలో తెలియక అమాయకంగా దిక్కులు చూస్తున్నాయ్.
కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే.. బీజేపీది మరో సీన్ ! గతంతో పోలిస్తే దూకుడు చూపిస్తున్నా… బీఆర్ఎస్ నుంచి అధికారం కొల్లగొట్టేంత సీన్ కనిపించడం లేదు. 119 నియోజకవర్గాల్లో చాలా చోట్ల కమలం పార్టీకి సరైన కేడర్ లేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా దొరకడం లేదు. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా ఉండడంతో.. బీఆర్ఎస్ పార్టీది ఆడింది ఆట అన్నట్లుగా తయారయింది. సరైన ప్రత్యామ్నాయం ఏదీ కనిపించకపోవడంతో.. ఆలోచనలన్నీ ఎటు తిరిగినా.. చివరికి కారు దగ్గరే వచ్చి పార్క్ అవుతున్నాయ్. ఒకరకంగా కేసీఆర్ వ్యూహం అదే.. కావాలనుకున్నది అదే ! గులాబీ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉన్నా.. బీఆర్ఎస్ ఆటలు ఎందుకు నడుస్తున్నాయ్ అంటే.. సరైన ప్రత్యామ్నాయం లేకపోవడమే !