KCR: కోలుకుంటున్న కేసీఆర్.. మరో వారం ఆస్పత్రిలోనే..

సర్జరీ అనంతరం కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారని యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్‌కు అయిన సర్జరీ పెద్దది కావడంతో ఆయనను మరింత అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు.

  • Written By:
  • Updated On - December 9, 2023 / 04:04 PM IST

KCR: తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. తన ఫాంహౌజ్‌లో జారిపడ్డ కేసీఆర్‌ ఎడమకాలి తుంటికి గాయమైంది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు ఈ సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారని యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

KTR: నేను రాలేను.. ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్.. అసలు కారణం ఇదే..

కేసీఆర్‌కు అయిన సర్జరీ పెద్దది కావడంతో ఆయనను మరింత అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. ఆయన శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఐవీ ఫ్లుయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్‌తో వైద్యం అందిస్తున్నారు. ఆపరేషన్ జరిగినప్పటికీ ఆయనకు సాధారణ డైట్ అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్.. వాకర్ సాయంతో కొద్ది దూరం నడిచారు. కోలుకుంటున్న కొద్దీ ఇంకా నడిపించే ప్రయత్నం చేయిస్తారు. ప్రస్తుతం ఆయన నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఫిజియోథెరపీ కూడా చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ వైద్య పరిస్థితి దృష్ట్యా మరో వారం రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి రావొచ్చు.

సాధారణంగా తుంటి ఎముక సర్జరీ జరిగితే కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది. అయితే, కేసీఆర్ వయసు రీత్యా దాదాపు మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారు. కేసీఆర్‌కు సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆయన తనయుడు కేటీఆర్, కూతురు కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రివద్దే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు.