బీజేపీపై నిన్నమొన్నటివరకు ఒంటికాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఉన్నట్టుంటి టోన్ మార్చారు. అసలు బీజేపీని కరివేపాకులా తీసిపడేస్తున్నారు. బీజేపీ తన ప్రత్యర్ధే కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. బహిరంగ సభల్లో ఎక్కడా కూడా బీజేపీ ఊసెత్తడంలేదు. కేవలం కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారు. హస్తం నేతలపైనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. కేసీఆర్ సడన్‌గా కాంగ్రెస్‌ని కార్నర్ చేయడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే ఊపులో తెలంగాణలో పాగా వేయలన్నది సోనియా పార్టీ ఆలోచన. ఇదేం పెద్ద అసాధ్యమనైన విషయం కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌కి ఇప్పటికీ మంచి క్యాడర్ ఉంది. గెలవగల అభ్యర్థులున్నారు. లేనిదల్లా యూనిటీ మాత్రమే. రాహుల్ గాంధీ ఓ అడుగువేసి కర్ణాటకలో ఈ సమస్యను చక్కదిద్దినట్టే ఇక్కడ కూడా ఆ పని చేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడిదే టెన్షన్ కేసీఆర్‌లో క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది.
బీజేపీపై మారిన కేసీఆర్ స్టాండ్?:
నాలుగు నెలల ముందు వరకు లిక్కర్ స్కామ్ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరిగాయి.కవిత ఎప్పుడు జైలుకు వెళ్తారోనన్న వార్తలు అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి. నిజానికి గత ఫిబ్రవరీలోనే కవిత అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇటు తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ ఇష్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. దీంతో కేసీఆర్-తెలంగాణ నేతల మధ్య భీకరమైన యుద్ధం జరగుతున్నట్టే కనిపించింది. కట్ చేస్తే లిక్కర్ స్కామ్‌పై ఇప్పుడు ఎక్కడా కూడా చప్పుడు వినపడడంలేదు. ఇటు టెన్త్ పేపర్ లీక్ కేసు ఏ మూలనో నక్కి కుర్చొంది. ఇక కొద్దీ వారాల క్రితం వరకు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ ఐపోయారు. ఎప్పుడో కానీ బీజేపీ ఊసెత్తడం లేదు.
బీజేపీతో లాలూచీ పడ్డారా? లేకపోతే కాంగ్రెస్ అంటే భయమా?
2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు వరకు బీజేపీని చాలా లైట్ తీసుకున్న కేసీఆర్.. ఆ తర్వాత స్లో స్లోగా కాషాయ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిందన్న నివేదికలు కూడా రావడంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకోని కమలం పార్టీని కార్నర్ చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో బీజేపీనే తమ ప్రత్యర్థి అని ప్రజలు భావించేలా బండి సంజయ్‌ని టార్గెట్ చేశారు. దీంతో ఓటర్లు సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికలు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీనేనని ఓ అంచనాకు వచ్చారు. అయితే ఇంతలోనే కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
ఇటు ప్రజలకు సైతం కాంగ్రెస్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. అంతర్గత కుమ్ములాటలు లేకపోయి ఉంటే కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పటికీ స్ట్రాంగ్ పార్టీనే. ఆ గొడవలు, కొట్లాటలు వదిలేసి గెలుపు కోసమే ఆ పార్టీ నాయకులు యూనిటీగా కృషి చేస్తే కేసీఆర్ పాలనకు ఎండ్‌కార్డ్ పడొచ్చు కూడా. ఇప్పుడిదే భయం సీఎం సార్‌లో కనిపిస్తుంది. అటు MIM కూడా ఈ మధ్య స్వరం మార్చి మాట్లాడుతోంది. కేసీఆర్ ముస్లింలకు ఏమీ చేయడంలేదని అర్థం వచ్చేలా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేయడం బీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. MIM మద్దతుతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్‌ఎస్..ఈసారి మజ్లీస్ సపోర్ట్ లేకుండా బరిలోకి దిగే ఛాన్స్ ఉందా అంటే ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. ఆ రెండు పార్టీలది చాలా థిక్ ఫ్రెండ్‌షిప్. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు కదా..! దీంతో కేసీఆర్‌కు గతంలో ఎప్పుడూ లేని విధంగా భయం పట్టుకుంది.ఒకవేళ ఈసారి ఎలాగోలా గెలిచి సీఎం కుర్చిలో కర్చిఫ్ వేసినా.. కాంగ్రెస్ గట్టి పోటి ఇస్తే మాత్రం అది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తుంది. అది జరగకూడదంటే కాంగ్రెస్ చిత్తుచిత్తూగా ఓడిపోవాలి. అందుకే కాంగ్రెస్‌ని పనిగట్టుకొని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.