Seethakka: సీతక్క టార్గెట్‌గా కేసీఆర్‌ భారీ ప్లాన్‌..

ఖమ్మంలో పొంగులేటి.. ములుగులో సీతక్క మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నారు. పొంగులేటి సంగతి ఎలా ఉన్నా.. ములుగు మ్యాటర్‌ను మాత్రం మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌లో బలమైన నేతలలో ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియాస్ సీతక్క ఒకరు.

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 02:51 PM IST

Seethakka: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఎవరిని ఎక్కడ కొట్టాలి.. ఎలా కొట్టాలి.. కొట్టేందుకు సిద్ధం చేయాల్సిన వ్యూహాలు ఏంటి.. రచించాల్సిన ప్రణాళికలు ఏంటి.. ఇలా తెలంగాణలో ఏ పార్టీ ఆఫీస్‌ దగ్గర చూసినా.. ఇతే తరహా గంభీరమైన వాతావరణమే కనిపిస్తోంది. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్‌ కొట్టాలని ఫిక్స్ అయిన కేసీఆర్.. ఏ విషయంలో తగ్గేదే..లే అంటున్నారు. పార్టీ బలాల మీద దృష్టి సారిస్తూనే.. ప్రత్యర్థి పార్టీ బలహీనతలను టార్గెట్‌ చేస్తున్నారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్యే వచ్చే ఎన్నికల ఫైట్ ఉండబోతుందని ఖాయంగా కనిపిస్తోంది. ఐతే కాంగ్రెస్‌లో ఉన్న కీలక నేతలను టార్గెట్‌ చేస్తూ.. కేసీఆర్‌ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి.. ములుగులో సీతక్క మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నారు. పొంగులేటి సంగతి ఎలా ఉన్నా.. ములుగు మ్యాటర్‌ను మాత్రం మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌లో బలమైన నేతలలో ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియాస్ సీతక్క ఒకరు. కోయ సామాజికవర్గానికి చెందిన సీతక్కకు.. ఆదివాసీలలో బలమైన మద్దతు ఉంది. అంతేకాకుండా గతంలో మావోయిస్ట్ నాయకురాలిగా కూడా పనిచేయడంతో మావోయిస్ట్ సానుభూతి పరులలోనూ సీతక్కకు మద్దతు ఉంది. ఇంకా వ్యక్తిగత సేవా కార్యక్రమాలు చేయడంలోనూ, నియోజకవర్గ సమస్యలను తీర్చడంలోనూ సీతక్క ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న మహిళా ఎమ్మెల్యేగా సీతక్క నిలిచారు. ములుగులో సీతక్కను ఓడించడం అంత ఈజీ కాదు.

దీంతో ఈసారి సీతక్క టార్గెట్‌గా కేసీఆర్‌ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ములుగులో బీఆర్ఎస్‌ జెండా ఎగిరేలా వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. అందుకే సీతక్కకు ధీటుగా ఆమె సామాజికవర్గానికి చెందిన నాగజ్యోతికి టికెట్‌ కన్ఫార్మ్ చేశారు గులాబీ బాస్. ఐతే ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. దీంతో సీటు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయ్. ఐతే సీతక్కకు చెక్ పెట్టాలంటే… నాగజ్యోతి మాత్రమే కరెక్ట్ అని.. ఆ విషయంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్. సీతక్కలానే నిత్యం జనాల్లోనే ఉండే నాయకురాలిగా.. నాగజ్యోతికి పేరు ఉంది. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినా.. జనాల్లో నాగజ్యోతికి మంచి పేరు ఉంది. నాగజ్యోతి తల్లిదండ్రులు కూడా గతంలో మావోయిస్టులుగా అజ్ఞాతంలో పనిచేసిన వారే. ఇలా ఎలా చూసినా.. సీతక్కను ఢీ కొట్టేందుకు నాగజ్యోతి కరెక్ట్ అని కే‌సి‌ఆర్ భావిస్తున్నారట.

ఇక అటు సమయం దొరికిన ప్రతీసారి ములుగుకు చేసిన కార్యక్రమాలను కూడా కేసీఆర్, హరీష్ రావు వివరిస్తున్నారు. సీతక్కను అక్క అంటూ పిలుస్తూనే.. రోడ్లు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ.. ఇలా ప్రతీ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొన్న వచ్చిన వరదల సమయంలోనూ.. అండగా నిలిచి జనాలకు చేరువ అయ్యారు కేసీఆర్. ఇలా ములుగులో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మరి కారు పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా.. గులాబీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.