CM KCR: జాతీయ రాజకీయాలపై ఆశలు వదులుకోని కేసీఆర్.. మహారాష్ట్రపై మరింత ఫోకస్!

జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆశలు వదులుకోకపోవడం విడ్డూరం. జాతీయ రాజకీయాల్లో ఇంకా కేసీఆర్ ప్రభావం చూపాలనుకుంటున్నారు.

CM KCR: ఇటీవలి కర్ణాటక ఫలితాలు కచ్చితంగా జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసేవే. అక్కడ కాంగ్రెస్ సాధించిన విజయం ఆ పార్టీకి పునర్జీవాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. నిన్నామొన్నటి వరకు కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుని, ఆ పార్టీని పక్కనబెట్టిన మిత్ర పక్షాలు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆశలు వదులుకోకపోవడం విడ్డూరం. జాతీయ రాజకీయాల్లో ఇంకా కేసీఆర్ ప్రభావం చూపాలనుకుంటున్నారు. తన బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టారు. అక్కడ పలువురు నేతలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని ఒక పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ తరఫున ఒక వార్డ్ మెంబర్ గెలిచారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తమ ఘన విజయంగా చెప్పుకొంటున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన శిక్షణా తరగతులకు కేసీఆర్ హాజరయ్యారు. శనివారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఈ శిక్షణా తరగుతులకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అక్కడ ఎప్పట్లాగే కేసీఆర్ జాతీయ రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలపై మాట్లాడారు. దేశంలోని సమస్యలకు బీఆర్ఎస్ పరిష్కారం చూపగలదన్నారు. నెల రోజులపాటు అనేక చోట్ల ఈ శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే, కేసీఆర్ మహారాష్ట్రపై ఇంతగా ఫోకస్ చేయడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించారు. జేడీఎస్‌తో చర్చలు కూడా జరిపారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి పోటీ ఊసే ఎత్తలేదు. పోటీకి దూరంగా ఉన్నారు.

కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఇక ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్నా అది కూడా బెడిసికొట్టింది. దీంతో కేసీఆర్, బీఆర్ఎస్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల అంశం జోక్‌గా మారుతోంది. చెప్పిన మాటకు కేసీఆర్ కట్టుబడి ఉండటం లేదు. పైగా గతంలో ఆయనకు మద్దతుగా వచ్చిన కుమార స్వామి, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఇప్పుడు కేసీఆర్‌ను పట్టించుకునే అవకాశం లేదు. మరోవైపు నెమ్మదిగా కాంగ్రెస్ బలపడుతోంది. ఇతర పక్షాలు ఆ పార్టీకి మద్దతిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఒక్కటయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటమిగా మారే అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్‌కు చోటెక్కడుంటుంది. అసలే తెలంగాణలోనూ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి దశలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పరుగులు పెట్టడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.