CM KCR: కేసీఆర్ తన రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. ప్రధాని పీఠంపై కూడా కన్నేశారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతో కూటమి కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కనబెట్టేశారు. అందరిలాగే కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకున్నారు. తనకున్న ఆర్థిక బలంతో ఇతర పార్టీల నేతలను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
సీఎం కేజ్రీవాల్, సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, కుమార స్వామి వంటి జాతీయ స్థాయి నేతలు కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఇంకేం.. నెమ్మదిగా జాతీయ రాజకీయాల్లో దూసుకుపోవచ్చనుకున్నారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను పట్టించుకునేవాడే లేడు. నిన్నామొన్నటివరకు కేసీఆర్ పక్కన నిలబడ్డ నేతలెవరూ ఇప్పుడాయనను పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో పార్టీలన్నీ కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి. ఆ పార్టీకి దూరమైన మిత్రపక్షాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తోంది.
ఎలా మొదలైందో కానీ.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కూటమి కట్టాలనుకున్నారు. ఈ కూటమి ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. అనేక పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల ద్వారా బలహీనపడుతూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదని, అటు కాంగ్రెస్ బలహీనంగా మారిందనే ఉద్దేశంతో ఆ స్థానాన్ని తానే భర్తీ చేయాలనుకున్నారు కేసీఆర్. ఇందుకోసం టీఆర్ఎస్‌ను రద్దు చేసి బీఆర్ఎస్‌గా మార్చారు. పలు రాష్ట్రాలకు తెలంగాణ ఖజానాకు చెందిన సొమ్మును అప్పనంగా పంచిపెట్టి, తన రాజకీయాలకు వాడుకున్నారు. రైతుల గురించి, కేంద్ర అప్పుల గురించి, జల వనరుల గురించి ఏవేవో మాట్లాడారు. దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల సత్తా తనకే ఉందన్నట్లు ప్రచారం చేసుకున్నారు.
మెల్లిగా కొన్ని పార్టీలకు దగ్గరయ్యారు. ఆమ్ ఆద్మీ, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్ వంటి పార్టీలు కేసీఆర్‌కు మద్దతిచ్చాయి. ఇతర పార్టీలనూ సంప్రదించారు. తనకున్న ఆర్థిక బలాన్ని వాడుకున్నారు. ఇక జాతీయ రాజకీయాల్ల ప్రతిపక్ష కూటమి కట్టగల సత్తా తనకే ఉందని నమ్మారు. తన ఆధ్వర్యంలోనే పార్టీలు పని చేస్తాయని భ్రమపడ్డారు. ఇదే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం కేసీఆర్ ఆశలపై నీళ్లుజల్లింది. మోదీ, అమిత్ షా వంటి నేతలు ఎంతగా ప్రచారం చేసినా.. అక్కడ కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీకి మళ్లీ పునర్వైభవం వచ్చింది. మొన్నటివరకు ఆ పార్టీకి దూరంగా ఉన్న మిత్రపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కూటములు పేరుతో విడిపోవడం కన్నా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పని చేస్తే మోదీని ఓడించవచ్చని భావిస్తున్నాయి. అంటే బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్ముతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి.ఇక కేసీఆర్‌తో కూటమి కట్టేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేనట్లే. ఇప్పటి పరిస్థితుల్లో ఆయనను పట్టించుకునే వాళ్లే లేరు. తాజా రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మాత్రమే ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని కూటమికి ఛాన్సే లేదు. బీఆర్ఎస్ కూడా అటు బీజేపీతో లేదా కాంగ్రెస్‌తో కలవాల్సిందే.
తెలంగాణలోనే డౌట్?
ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పుంజుకుంటోంది. కర్ణాటక ఫలితాలు ఆ పార్టీకి మంచి బూస్టప్ ఇచ్చాయి. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. అటు ప్రజల్లో బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కోసమే బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి.. తమకే గెలుపు దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అంతే తప్ప.. సొంత పార్టీ విషయంలో బీఆర్ఎస్ నేతలకే గెలుపుపై నమ్మకం లేని పరిస్థితి. అలాంటిది జాతీయ రాజకీయాలంటే బీఆర్ఎస్‌కు అత్యాశే అవుతుంది.