Jitta – Kishan : జిట్టా ప్లాన్‌ను ముందే పసిగట్టిన కిషన్ రెడ్డి..! అందుకే వేటు వేశారా..?

విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి ముందు జాగ్రత్తగా జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆలస్యం చేస్తే పార్టీ నుంచి మరికొంతమంది నేతలు వీడడం ఖాయమనుకున్నారు. రాణి రుద్రమతో కలిసి జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 03:51 PM IST

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పరిణామాలు ఇంట్రస్టింగ్ గా ఉంటున్నాయి. బండి సంజయ్ ని తప్పించడం, ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో కొందరు నేతలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. తప్పుదిద్దుకునేందుకు హైకమాండ్ తంటాలు పడుతుండడం చూస్తున్నాం. తాజాగా జిట్టా బాలకృష్ణారెడ్డిపై అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేటు వేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన యువ తెలంగాణ పేరుతో పార్టీ నడిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జిట్టా బాలకృష్ణారెడ్డి కేసీఆర్ కు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆ తర్వాత విభేదాలు రావడంతో రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లారు. రాష్ట్రవిభజనతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి యువ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి కొంతకాలం నడిపారు. గతేడాది యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారాయన. ఆయనతో పాటు రాణి రుద్రమ కూడా బీజేపీలో చేరారు. కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని వాళ్లిద్దరూ భావించి పార్టీని సైతం విలీనం చేసేశారు. కొంతకాలం పార్టీలో యాక్టివ్ గా కూడా కనిపించారు.

అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణలో బీజేపీ ప్రభావం తగ్గిపోతోందనేది జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఆలోచన. అందుకే ఆ పార్టీలో ఉంటే మనుగడ ఉండదని భావించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. అంతేకాక బీజేపీకి వ్యతిరేకంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. ఇవి పార్టీలో పెద్ద కలకలమే సృష్టించాయి. దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డిపై కిషన్ రెడ్డి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో భేటీ అయినట్లు తేలింది. అంతేకాక.. బీజేపీ నుంచి ఐదారుగురు పెద్ద నేతలను పార్టీలోకి తీసుకొస్తానని కాంగ్రెస్ పెద్దలకు మాటిచ్చినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి ముందు జాగ్రత్తగా జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆలస్యం చేస్తే పార్టీ నుంచి మరికొంతమంది నేతలు వీడడం ఖాయమనుకున్నారు. రాణి రుద్రమతో కలిసి జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.