KTR COMMENTS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌లో అంతర్మధనం మొదలైందా..? అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని జిల్లా స్థాయి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు గుర్తుకొస్తున్నారా..? పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నేతల నుంచి వస్తున్న విమర్శలను ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నారా..? అదే అహంకారంతో ముందుకెళితే పార్టీకి భవిష్యత్తు ఉండదని ఇప్పటికైనా తెలుసుకుంటున్నారా..?
10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు ఏమీ కనిపించలేదు. ముఖ్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి నిలబెట్టిన తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, మండల, జిల్లా స్థాయి నేతలు.. వీళ్ళెవరినీ గుర్తించలేదు. కనీసం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో సంప్రదించింది లేదు. జిల్లా, మండల స్థాయి పోస్టులను కూడా హైదరాబాద్ స్థాయిలోనే భర్తీ చేశారు. ఏ నేతనైనా బలవంతంగా రుద్దడమే తప్ప.. కార్యకర్తలు, లీడర్ల మాటలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత.. కనీసం మీటింగ్స్ పెట్టి కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. కానీ ఈ మీటింగ్స్‌లో కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ విచిత్రంగా ఉన్నాయి. పదేళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాసలో పడి.. పార్టీని పట్టించుకోలేదని అంటున్నారు. కొద్దో గోప్పొ డెవలప్‌మెంట్ జరిగిన సంగతిని తెలంగాణ జనమంతా ఒప్పుకుంటారు. కానీ, అవినీతి లేకుండా జరిగిందని మాత్రం ఎవరూ అంగీకరించే పరిస్థితుల్లో లేరు.
Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!
అసెంబ్లీ ఎన్నికల దాకా బీజేపీకి బీటీమ్ అని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ సంగతిని జనంలోకి బాగా తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. కానీ కవిత అరెస్ట్ కాకపోవడానికి తమ మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం కాదంటున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంకోర్టు జోక్యానికి భయపడే కవితను కేంద్ర ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని కేటీఆర్ అనడం విచిత్రంగా అనిపించింది. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి మాటలు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు. కేటీఆర్ మళ్ళీ ఆ పాత పాటనే ఎందుకు ఎత్తుకున్నారంటే.. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పద్దతి మారిందని కామెంట్ చేశారు. తాము కోర్టుకి వెళ్ళినా ఫలితం దక్కలేదన్నారు. కానీ రెండు వేర్వేరు ఎమ్మెల్సీల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వాటిని విడిగానే నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎప్పుడో ఉన్నాయి.
మన రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో.. ఇలా ఎప్పుడు ఎదురవ్వలేదు కాబట్టే రూల్స్ తెలియదు. కానీ ఉత్తరప్రదేశ్ లో గత ఏడాది మేలోనే ఈ పద్దతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ హైకోర్టు కూడా ఈసీ నిబంధనలనే సమర్థించింది. ఇప్పటికిప్పుడు అమిత్ షా, రేవంత్ రెడ్డి కలసి ఈ నిబంధనలు మార్చేశారని అని కేటీఆర్ ఎందుకు కామెంట్ చేశారో ఆయనకే తెలియాలి. బీఆర్ఎస్ ఓడిపోవడంతో.. ఆ పార్టీ సింబల్ అయిన కారు.. షెడ్డుకు వెళ్ళిందని గతంలో సెటైర్లు వచ్చాయి. వాటిని ఇప్పుడు తిప్పికొట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే… పదేళ్ళు రెస్ట్ లేకుండా తిరిగిన కారు.. మరింత స్పీడ్ గా వెళ్ళడానికి సర్వీసింగ్ కి వెళ్ళిందన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి పోతున్నాయి. రాబోయే రోజుల్లో పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని అంటున్నారు. అప్పుడు కారు పరిస్థితి ఏంటో చూడాలి. అయితే పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వలేకపోయామని మాత్రం కేటీఆర్ ఒప్పుకున్నారు. అందుకే తనదే బాధ్యత అంటున్నారు. కానీ ఈ ఆలోచన అప్పుడే ఉంటే బాగుండేమో.. చాలా ఆలస్యంగా గ్రహించినట్టు కనిపిస్తోంది.