రియల్‌ ఎస్టేట్‌ను నాశనం చేశావ్‌ రేవంత్‌పై కేటీఆర్ ట్వీట్‌

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతకాక సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోదంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం హవా చూపించిన కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో మాత్రం సత్తా చాటలేకపోయింది.

  • Written By:
  • Updated On - October 8, 2024 / 12:47 PM IST

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతకాక సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోదంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం హవా చూపించిన కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో మాత్రం సత్తా చాటలేకపోయింది. అన్నీ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించినా.. హైదరాబాద్‌ ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌కే జైకొట్టారు. ఈ కారణంగానే హైదరాబాద్‌ ప్రజల మీద కక్ష సాధించేందుకు హైడ్రా పేరుతో ఇళ్లు కూలుస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌ సర్కార్‌ చేసిన ఈ పని వల్ల ప్రజలు నష్టపోవడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పోయిందన్నారు. ” హైడ్రా హైరానాతో 2 నెల‌ల్లో హైద‌రాబాద్‌లో రియ‌ల్‌ఎస్టేట్ ప‌డిపోయింది. రిజిస్ట్రేష‌న్లు ప‌డిపోయాయి. ఆదాయం త‌గ్గిపోయింది. అయ్యా.. నువ్వు కొత్తగా ఆదాయం సృష్టించడం వద్దులే కానీ ఉన్న ఊడగొట్టకుండా ఉంటే చాలు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నావో అర్థమవుతోందా? నీ ఫోర్‌ బ్రదర్‌ సిటీపై ఫోకస్‌ చేసి అక్కడ కృత్రిమ రియల్‌ బూమ్‌ కోసం ఆలోచిస్తున్నట్టున్నావ్‌.. సామాన్యులు కొనుగోలు, అమ్మకం చేయకుండా రియల్‌ ఎస్టేట్‌లో బూమ్‌ ఎలా వస్తుంది ఆదాయం ఎలా పెరుగుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావ్‌ స్వామీ తెలంగాణని” అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత చెరువుల పరిరక్షణకు హైడ్రాను తీసుకువచ్చింది ప్రభుత్వం. FTL, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలు కూల్చడంతో.. కొత్త ఇల్లు కొనాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చెప్పి ఇల్లు కూల్చేస్తారోనని చాలా మంది భయంతో ఉన్నారు. ఇక చెరువులు, కాలువల పక్కన ఇల్లు, అపార్ట్‌మెంట్‌ ఉన్నవాళ్లు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ ఒక్కసారిగా పడిపోయింది. హైడ్రా వచ్చిన తరువాతే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా రిపోర్ట్‌లు కూడా వచ్చాయి. ఓ పత్రికలో వచ్చిన స్టోరీని పోస్ట్‌ చేస్తూ కేటీఆర్‌ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.