బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావునీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా? పది రోజుల క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరియా పర్యటనలో ఉన్నప్పుడు .. త్వరలో ఒక పెద్ద లీడర్ లోపలికి వెళ్తాడని పరోక్షంగా చెప్పనే చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తుని ఏసీబీకి అప్పజెప్పడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేటీఆర్ జైలుకెళ్ళక తప్పేటట్లు లేదు. అందుకే అరెస్టు నీ కూడా తనకు అనుకూలంగా పబ్లిసిటీ తెచ్చుకునేందుకు కేటీఆర్ పాదయాత్ర తలపెట్టారు. పాదయాత్ర సమయంలో తనను అరెస్టు చేస్తే మామూలు కన్నా ఎక్కువ మైలేజ్ వస్తుందని కేటీఆర్ ఆశిస్తున్నాడు.
కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు అక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. అవినీతికి బాధ్యులైన వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా సరే వదిలిపెట్టొద్దని స్పష్టం చేసింది.2023లో నిర్వహించిన ఈ రేస్ లో 55 కోట్ల రూపాయల అక్రమాలను ఇప్పటికే గుర్తించారు. ఈ కుంభకోణంలో కొందరు ఐఏఎస్ లు సహా, అప్పటి సర్కారు పెద్దల ప్రమేయం కూడా ఉందని ప్రాథమికంగా తేలడంతో కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ఈ కేసులో పెద్ద తలకాయలు చాలామంది ఉండటంతో దీన్ని ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కి అప్పజెప్పబోతున్నారు. మరో వారంలో ఏసీబీ రంగంలోకి దిగనుంది.
2023లో హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. సెక్రటేరియట్ ఎదురుగా ట్యాంక్ బండ్ చుట్టూ మూడు కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. అది పెద్ద సక్సెస్ కాకపోయినా 2024 ఫిబ్రవరి 10 రెండోసారి రేస్ నిర్వహించేందుకు 2023 అక్టోబర్ లోనే విదేశీ సంస్థలతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 55 కోట్లు చెల్లించింది. అయితే దీనికి క్యాబినెట్ అనుమతి గానీ, ఆర్థిక శాఖ లాంటి ఇతర విభాగాల నుంచి అనుమతులు గానీ లేకుండానే 55 కోట్ల రూపాయలు ఇచ్చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… ఈ స్కాంపై దృష్టి పెట్టింది.2024 ఫార్ములా ఈ రేస్ నీ రద్దు చేసింది. దీనికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నీ ప్రశ్నించింది కూడా.55 కోట్ల రూపాయలకు ఎటువంటి క్యాబినెట్ ఆమోదం లేదని… అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేసినట్లు అరవింద కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. గతంలో తమిళనాడులో డీఎంకే సర్కార్ ,ఫార్ములా ఈ రేస్ కి డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ అది క్యాబినెట్ ఆమోదం తోనే చేసింది.
తెలంగాణలో మాత్రం కేవలం కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతో 55 కోట్లు వెదజల్లేసారు. ఇప్పుడు దీని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు ప్రారంభిస్తుంది. కేసు ఎటు చూసినా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. కేసు తీవ్రతను బట్టి ఎసిబి కేటీఆర్ నీ అరెస్ట్ చేసినా…. ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్ని ముందుగానే ఊహించాడు కేటీఆర్. అరెస్టు తప్పదని నిర్ణయానికి వచ్చేసారాయన . అయితే నెగిటివ్ లో పాజిటివ్ వెతుక్కోవడంలో ఆరితేరిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించ బోతున్నాడు. ఒకవేళ అరెస్టు అంటూ జరిగితే జనం మధ్యలోనే అరెస్ట్ అవ్వాలని… ఆ సందర్భంగా కావలసినంత సెంటిమెంట్ ని.. పబ్లిసిటీని పొందవచ్చు అని కేటీఆర్ వ్యూహం. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు అయినప్పటికీ కుటుంబానికి గాని, బి ఆర్ ఎస్ పార్టీ గాని పెద్దగా మైలేజ్ రాలేదు. అంతేకాదు కవిత అరెస్టు బిజెపికి అడ్వాంటేజ్ అయింది కూడా. లోక్సభ ఎన్నికల్లో బిజెపి 8 సీట్లు గెలుచుకోగలిగింది. అందుకే ఈసారి కేటీఆర్ ఇంట్లో కాకుండా వీధిలో అరెస్టు అయితే మైలేజ్ బాగా తెచ్చుకోవచ్చని ఆలోచన లో ఉన్నారు.