BRS: బీజేపీకి చెక్ పెట్టే దిశగా బీఆర్ఎస్.. వంద అబద్ధాలు పేరుతో ప్రచారం..!

అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ.. వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వంద రోజులపాటు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. వంద అబద్ధాల బీజేపీ (100 లైస్ ఆఫ్ బీజేపీ) పేరుతో ప్రచారం ప్రారంభించింది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 03:11 PM IST

BRS: మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ.. వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వంద రోజులపాటు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. వంద అబద్ధాల బీజేపీ (100 లైస్ ఆఫ్ బీజేపీ) పేరుతో ప్రచారం ప్రారంభించింది. దీనిలో భాగంగా ఒక సీడీని, బుక్‌లెట్‌ను విడుదల చేసింది.

2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రజలకు ఇచ్చి, నెరవేర్చని వంద హామీలను దీని ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఈ సీడీలు, బుక్‌లెట్‌లను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణతోపాటు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు.. వాటిలో నెరవేర్చని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. మోదీ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, ఇండ్లు, విభజన హామీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, నల్లధనం వెనక్కి తేవడం వంటి పలు హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో లక్షలు జమ చేస్తానన్నారు. ఇలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమైంది. ఇలాంటి వాటిని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయబోతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఈ విషయంలో యాక్టివ్‌గా పని చేయబోతుంది. రాబోయే నాలుగు నెలలపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా ఈ ప్రచారం సాగబోతుంది.

మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇండ్ల నిర్మాణాల్ని పరిశీలించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీ కూడా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోబోతుంది. దీనికి నిజామాబాద్ ఎంపీ ధర్మపరి అర్వింద్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ప్రస్తుతం మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ భారీగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అన్ని పార్టీలు ఇందుకోసం ప్రత్యేక టీములను రెడీ చేసుకుంటున్నాయి.