మంత్రి కొండ సురేఖ పై తాను వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్… ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు స్పష్టం చేసారు. ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చానని తెలిపిన ఆయన… ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదని తెలిపారు. రాజకీయ విమర్శల పేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖ పై వేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలన్నారు. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నదని తెలిపారు.