కేటిఆర్ వాల్యూమ్ తగ్గింది, అస్సలు ఊహించలా… అప్పుడు కెలికి… ఇప్పుడు సైలెంట్…?

సినిమా వాళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ కు మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. రాజకీయంగా భారత రాష్ట్ర సమితి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే సినిమా వాళ్లకు మాత్రం కేటీఆర్ అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువగా సినిమా వాళ్ళతో స్నేహం చేసేవారు.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 01:09 PM IST

సినిమా వాళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ కు మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. రాజకీయంగా భారత రాష్ట్ర సమితి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే సినిమా వాళ్లకు మాత్రం కేటీఆర్ అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువగా సినిమా వాళ్ళతో స్నేహం చేసేవారు. పదేపదే సినిమా వాళ్ళతో సమావేశాలు కావడం… సినిమా వాళ్ళ కార్యక్రమాలకు హాజరు కావడం వంటివి చేస్తూ వచ్చారు. ఏ మాటకు ఆ మాట… మంత్రి కావడంతో సినిమా వాళ్ళు కూడా నెత్తిన పెట్టుకున్నారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… సినిమా వాళ్లకు అంత సౌకర్యవంతంగా వాతావరణం కనబడడం లేదు. తాజాగా అల్లు అర్జున్ వ్యవహారం అలాగే మొన్నమధ్య అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో హైడ్రా అధికారుల దూకుడు… అన్నీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో తెలంగాణలో బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పై కీలక ప్రకటన చేశారు శాసనసభలో.

అయితే దీనిపై కేటీఆర్ నుంచి స్పందన వస్తుందని చాలామంది ఎదురు చూశారు. కానీ కేటీఆర్ మాత్రం అసలు రియాక్ట్ కాలేదు. ఇదే సమయంలో శాసనసభలో అల్లు అర్జున్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలపై అల్లు అర్జున్ కు మద్దతుగా కేటీఆర్ మాట్లాడతారని కూడా చాలామంది ఊహించారు. కానీ కేటీఆర్ మాత్రం ఈ వ్యవహారంలో అసలు వ్యాఖ్యలు చేయలేదు. వాస్తవానికి ఈ వ్యవహారం ఇంత పెద్దది కావడానికి కేటీఆర్ కూడా ఒక కారణం అనే చెప్పాలి. రేవంత్ ను, అల్లు అర్జున్ ను గట్టిగా గిల్లింది కేటిఆరే.

పదేపదే బహిరంగ వేదికలపై అలాగే ఓ మీడియా ఛానల్ డిబేట్లో రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడని అందుకే ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేశారని కామెంట్ చేశారు. ఇక అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ పోలీసులు మాట్లాడుతున్న తీరు చూసి భారత రాష్ట్ర సమితి ఆయనకు మద్దతిస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా సీన్ అలా కనపడలేదు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యవహారంలో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

అటు ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ ను ఇబ్బంది పెట్టే సంకేతాలు కనపడటంతో ఆయన అసలు సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారంపై మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్రతి అంశంపై ట్వీట్ చేసే కేటీఆర్ శనివారం నుంచి ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అసలు ఈ వ్యవహారంలో ముందు కేటీఆర్ జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు అనే ఒపీనియన్ కూడా వినపడుతోంది. శాసనసభలో కేటీఆర్ టార్గెట్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

తనపై ట్విట్టర్లో పదేళ్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి తీవ్ర విమర్శలు చేశారని రేవంత్ కామెంట్స్ చేశారు. వాటిపై కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్… అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్ట్ లు చేస్తుంటే వాటిని కాస్త రీ పోస్ట్ చేశారు. మినహా వాటిపై ఎక్కడా కూడా ఆయన నేరుగా రియాక్ట్ కాలేదు. అయితే ఏసీబీ విచారణను ముందు తక్కువ అంచనా వేసిన కేటీఆర్ పదేపదే తనను అరెస్టు చేయాలంటూ సవాలు కూడా చేశారు.

జైల్లో కూర్చుని యోగ కూడా చేసుకుంటానంటూ ఒక ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నేరుగా ఎంటర్ కావడం దీనిపై కేసు నమోదు చేయడంతో కేటీఆర్ కు అసలు విషయం అర్థమైంది. అందుకే ఆయన సైలెంట్ గా ఉండి ఉండవచ్చు. ఒకరకంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకోవడానికి భారత రాష్ట్ర సమితి కూడా కారణమనే ఒపీనియన్ కూడా ఉంది. సినిమా వాళ్లు కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండటం, కనీసం తనను గుర్తించకపోవడం కేటీఆర్ డైరెక్షన్లో నడుస్తున్నారు అనే సంకేతాలు రావడమే రేవంత్ రెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారని కొంతమంది రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్న కామెంట్. ఏది ఎలా ఉన్నా ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేసే కేటీఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి భవిష్యత్తులో అయినా ఆయన నుంచి స్పందన ఉంటుందా లేదా అనేది చూడాలి.