వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన… వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని తుమ్మల చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు కేటిఆర్. వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసింది అని ఆరోపించారు.
లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని… ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు అని హెచ్చరించారు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారని హెచ్చరించారు.