KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి పెద్ద మనసు.. నిధులు సేకరించిన హిమాన్షు.. ప్రభుత్వ పాఠశాలకు వెలుగులు..!

గౌలిదొడ్డి కేశవనగర్‌లోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు నిధులు సేకరించి ఇచ్చాడు. దీంతో పాఠశాలను నెల రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలను హిమాన్షు పుట్టిన రోజైన జూలై 12న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించబోతున్నారు.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 02:44 PM IST

KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు చొరవతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. గౌలిదొడ్డి కేశవనగర్‌లోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు నిధులు సేకరించి ఇచ్చాడు. దీంతో పాఠశాలను నెల రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలను హిమాన్షు పుట్టిన రోజైన జూలై 12న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించబోతున్నారు.
హిమాన్షు ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ ప్రైవేటు స్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడ చదివే సమయంలో క్యాస్ (కమ్యూనిటీ యాక్షన్ సర్వీస్) విభాగానికి చెందిన విద్యార్థులతో కలిసి దగ్గర్లోని గచ్చిబౌలి, కేశవనగర్ పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించేవాడు. గత సంవత్సరం హిమాన్షు క్యాస్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. అయితే, ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు అక్కడి సమస్యల్ని చూసి, వసతులు కల్పించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే నిధుల సేకరణకు శ్రీకారం చుట్టాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ను సంప్రదించి, తన స్కూల్ విద్యార్థుల వద్ద నుంచి రూ.90 లక్షలు సేకరించాడు. ఈ నిధులను పాఠశాలకు అందజేశాడు. దీంతో నెల రోజుల క్రితం కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
వసతుల కల్పన
ఈ స్కూల్‌లో దాదాపు 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లందరికీ అనువైన వసతుల్ని ఈ నిధులతో ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్స్‌ను ఆధునికంగా తీర్చిదిద్దారు. గోడలకు రంగులు వేయించారు. డిజిటల్ క్లాసెస్‌ను అందుబాటులోకి తెచ్చారు. రూమ్స్‌లో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి, కిటికీలు, తలుపులు పెట్టించారు. విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బెంచీలు, డెస్కులు ఏర్పాటు చేయించారు. అలాగే లైబ్రరీ, డైనింగ్ రూం, వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. రెండు అదనపు తరగతి గదుల్ని నిర్మించారు. నీళ్లకు ఇబ్బంది రాకుండా.. బోర్ వేయించారు. వాటర్ ప్యూరిఫైర్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి అవసరమైన అన్ని వసతుల్ని హిమాన్షు సేకరించి ఇచ్చిన నిధులతో తక్కువ రోజుల్లోనే ఏర్పాటు చేయడం విశేషం. స్కూల్ అభివృద్ధి చెందడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.