అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత అమెరికాలో ఇండియన్స్ జీవితాలు మారిపోతాయి అనే చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం. ఉన్నవాళ్లలో చాలా మంది ఉద్యోగాలు పోతాయి.. కొత్త వాళ్లకు ఇక ఉద్యోగాలు రావడం కష్టం అనేది చాలా మందిలో ఉన్న డౌట్. కానీ.. ట్రంప్ మాత్రం తన కేబినెట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్‌లో కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులకు చాలా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివేక్ రామస్వాకి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. తులసీ గబ్బార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ ఆమె గురించి స్పీచ్ ఇచ్చారు.
తులసీ గబ్బార్డ్‌కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ చెప్పారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు తులసిని ఆకాశానికెత్తేశారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తులసి మీదకు వెళ్లింది. అసలు ఎవరీ తులసి. ట్రంప్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఆమెకు ఇస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. తులసి గబ్బార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో ఉండేది. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయ్యింది. తులసి గబ్బర్డ్ దాదాపు రెండు దశాబ్దాలు యూఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్‌లో సేవలందించారు. ఇరాక్, కువైట్‌లోనూ పని చేశారు. అయితే, ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. తులసి గబ్బార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. తులసి గబ్బార్డ్‌కు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవు.
కానీ, ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబ్బర్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు. 2020 సంవత్సరంలో తులసి గబ్బర్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. అయితే, మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌కి స్పీచ్ ట్రైనింగ్ ఇచ్చిన కీలక వ్యక్తి తులసీ గబ్బార్డ్. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబ్బర్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబ్బార్డ్, కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసీ పేరు ప్రధానంగా వినిపించింది. గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్ ఆమెను యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశానికి కాపుకాసే బాధ్యత ఓ హిందూ మహిళ నిర్వహించబోతున్నారు.