LASYA NANDITHA: గ్రేటర్‌లో తండ్రుల చరిష్మాతో అసెంబ్లీ బరిలోకి దిగిన ముగ్గురు వారసుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత మాత్రమే విజయ దుందుభి మోగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన 36 ఏళ్ల లాస్య నందిత కూడా మొదటి ఎన్నికల్లోనే తన సత్తా చాటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు.
REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..
వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేశారు. అదే స్థానంలో కొత్తగా గద్దర్ వారసురాలు వెన్నెల ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ తన తండ్రి గద్దర్ పేరుతో ఎన్నికల ప్రచారం చేసింది. అయితే ప్రజలు మాత్రం లాస్య నందితకే మద్దతు పలికారు. 17వేలకుపైగా మెజార్టీతో లాస్య బీజేపీ అభ్యర్థిపై గెలుపొందగా.. వెన్నెల మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెన్నెలకు 20,825 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు 41,888 ఓట్లు పోలయ్యాయి. అయితే లాస్య నందితకు గతంలో కార్పొరేటర్‌గా కూడా పని చేసిన అనుభవం రాజకీయంగా ప్లస్ అయ్యింది. దీనికి తోడు 25 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతితో ఆయన సెంటిమెంట్ కూతురికి కలిసి వస్తుందనే ధీమాతో బీఆర్ఎస్ లాస్య నందితకు టికెట్ కేటాయించింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ లాస్య నందిత ప్రచారంలో దూసుకుపోయారు.
ప్రచారంలో తనకున్న రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకున్నారు. పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. 17,169 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మంత్రి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి ఖైరతాబాద్ బరిలో ఓటమి పాలయ్యారు. ఇలా.. వారసుల జాబితాలో బరిలోకి దిగినవారిలో లాస్య నందిత మాత్రమే సూపర్ విక్టరీతో ఎమ్మెల్యేగా తన మొదటి అడుగును విజయవంతంగా వేశారు.