జమిలి ఎన్నికలపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అదంతా తూచ్ అని తేలిపోయింది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావని లా కమిషన్ స్పష్టం చేసింది. అయినా జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత ఆషామాషీ కాదని అందరికీ తెలుసు. అయినా కేంద్రం ఎందుకింత హడావుడి చేసింది?
జమిలి ఎన్నికల నిర్వహణ చట్టసవరణతోనే సాధ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టాన్ని సవరించడం అంత ఆషామాషీ కాదు. పార్లమెంటుతోపాటు రాష్ట్రాలు కూడా ఇందుకు సమ్మతించాల్సి ఉంటుంది. బీజేపీయేతర రాష్ట్రాలేవీ జమిలి ఎన్నికలకు సుముఖంగా లేవు. అయినా కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలు రాబోతున్నాయని నిన్నమొన్నటి వరకూ బాగానే హడావుడి చేసింది. ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ కూడా అందుకోసమేనని ప్రచారం చేసింది. అయితే అంతకుముందే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కమిటీ వేయడంతో ఇప్పట్లో అవి సాధ్యం కావని అర్థమైంది.
తాజాగా లా కమిషన్ కూడా ఇదే మాట చెప్పింది. ఈ దఫా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావని తేల్చేసింది. అయితే 2029 నాటికి సాధ్యమేనని హింట్ ఇచ్చింది. దీంతో 2029 నాటికి పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఇన్నాళ్లూ జరిగిన జమిలి ఎన్నికల ప్రచారమంతా విపక్షాలను ఫూల్ ను చేసేందుకేనని తేలిపోయింది.