BJP Politics: చేవెళ్ల నుంచి లక్ష్మణ్.? మధురై బరిలో నిర్మలా సీతారామన్.. 2024లో బీజేపీ వ్యూహం ఏంటి ?

కూటమితో సంబంధం లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 300 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తమకున్న బలాబలాలను అంచనా వేస్తున్న కమలనాథులు ఈసారి కొన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 01:52 PM IST

ప్రస్తుతం పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ ఎంపీలను,కొంతమంది కేంద్ర మంత్రులను అలాగే ఎమ్మెల్యేలను ఈసారి లోక్‌సభ పోటీలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం 18 మంది రాజ్యసభ ఎంపీలను లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా బీజేపీ హైకమాండ్ కోరినట్టు తెలుస్తోంది. వీరిలో 10 మంది కేంద్రమంత్రులు కూడా ఉన్నారు.

చేవెళ్ల నుంచి కె. లక్ష్మణ్ బరిలోకి దిగుతారా ?
తెలంగాణలో బీఆర్ఎస్‌ను గట్టిగా ఢీకొట్టి అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఎంపీ స్థానాలపైనా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో దేశంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీకి కీలకమే. అందుకే తెలంగాణలో అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ స్థానాలపైనా లెక్కలు వేసుకుంటుంది. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌ను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడెప్పుడు జెండా పాతలేదు. జైపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డికి పోటీగా ఇక్కడ నుంచి బీసీ నేత కె. లక్ష్మణ్‌ను బరిలో ఉంచాలని బీజేపీ భావిస్తోంది.

రాజాసింగ్‌ను లోక్‌సభకు పంపిస్తారా ?
తెలంగాణలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ నేతగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ పేరు కూడా బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆయన గోషమహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను నరనరాల్లో నింపుకున్న రాజాసింగ్‌ను ఈసారి లోక్‌సభకు ఎలివేట్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా బీజేపీలో జరుగుతుందట. యూపీలో యోగి తరహాలోనే రాజాసింగ్ కూడా కరుడుకట్టిన హిందుత్వవాది. ఆర్ఎస్ఎస్‌తో పాటు బీజేపీ ఎజెండాను నిక్కచ్చిగా అమలు చేసేందుకు రాజాసింగ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడరు. అలాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే దక్షిణాది నుంచి పార్టీకి మంచి వాయిస్ దొరుకుతుందని బీజేపీ భావిస్తోంది.

మధైర నుంచి నిర్మలా సీతారామన్ సై అంటారా ?
తమిళనాడు ఆడపడుచు.. తెలుగింటి కోడలు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇప్పటి వరకు రాజ్యసభకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగి గతంలో రక్షణ మంత్రిగా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నిర్మలాసీతారామన్‌ను ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని భావిస్తోంది బీజేపీ హైకమాండ్. నిర్మలాసీతారామన్ పుట్టిపెరిగింది మధురైలోనే. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేసే బీజేపీ.. నిర్మలాసీతారామన్‌ను మధురై నుంచి బరిలో దించాలనుకోవడం వెనుక కూడా చాలా వ్యూహాలు ఉన్నాయి. మొదటిది మధురై నిర్మల పుట్టిన ఊరు. రెండోది మధురై తమిళనాడు కల్చరల్ క్యాపిటల్‌గా ఉంది. బ్రాహ్మిణ్ పాపులేషన్ ఇక్కడ చాలా ఎక్కువ. నిర్మలాసీతారామన్ కూడా తమిళ అయ్యంగార్ కుటుంబంలోనే పుట్టారు. తమిళనాడులో ఓటు బ్యాంకు పెంచుకోవడానికి మధురై లాంటి చారిత్రక ప్రాంతాల్లో బలపడటమే మార్గమని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మణ నేపథ్యమున్న నిర్మలను మధురైలో పోటి చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.

ఆ స్థానాల నుంచే రాజ్యసభ ఎంపీలు పోటీలో ఎందుకు ?
రాజ్యసభ ఎంపీలను లోక్‌సభకు పోటీ చేయించే విషయంలో బేజేపీ ఓ ఫార్ములాను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో 18 మందిని సెలెక్ట్ చేసుకున్న బీజేపీ హైకమాండ్.. వారికి ఓ టాస్క్ అప్పగించిందట. వారందరూ కనీసం ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి. అలాగే ఆ ఐదు నియోజకవర్గాల్లో తమకు ఆసక్తి ఉన్న మూడు సీట్లను సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో ఒక స్థానం నుంచి పార్టీ వాళ్లను పోటీలో పెట్టే ప్లాన్ చేసినట్టు ఢిల్లీ వర్గాల కథనం. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ , జయశంకర్, ధర్మేంద్ర ప్రదాన్, మన్సుక్ మాండవియా, హర్‌దీప్ పూరి, పురుషోత్తమ్ రూపాలా వీళ్లంతా లోక్‌సభకు పోటీ చేసే వాళ్ల జాబితాలో ఉన్నారు.