Liquor Politics: ఏపీలో ప్రతిపక్షాలకు మందు కష్టాలు.. మద్యం దొరక్కుండా వైసీపీ యత్నాలు? తలలు పట్టుకుంటున్న పార్టీలు?

ఏపీలో ప్రతిపక్షాలకు మద్యం దొరక్కుండా చేసేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు మద్యం ఎలా పంపిణీ చేయాలా అని టీడీపీ తలలు పట్టుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల్లో మద్యం పంపిణీపైనే చర్చ నడుస్తోంది?

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 04:56 PM IST

Liquor Politics: ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా మద్యం పంచాల్సిందే. అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షాలైనా మద్యంపై ఆధారపడక తప్పదు. అందులోనూ ప్రతిపక్షాలకైతే మందు పంచడం తప్పనిసరి. అయితే, ఎన్నికల సమయంలో ఏపీలో ప్రతిపక్షాలకు మద్యం దొరక్కుండా చేసేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు మద్యం ఎలా పంపిణీ చేయాలా అని టీడీపీ తలలు పట్టుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల్లో మద్యం పంపిణీపైనే చర్చ నడుస్తోంది? అందుకే ముందస్తు జాగ్రత్త చర్యలపై పార్టీలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలంటే భారీగా డబ్బు, మద్యం పంచాల్సిందే. సాధారణ ఓటర్లను ఆకట్టుకోవాలన్నా, కార్యకర్తల్ని వెంటబెట్టుకోవాలన్నా మద్యం ఉండాల్సిందే. ముఖ్యంగా ప్రతిపక్షాలకైతే మద్యం పంపిణీ తప్పనిసరి. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకైతే ఇతర ప్రయోజనాలు అందుతాయి. కానీ, ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండే నేతలు, కార్యకర్తలకు ఏమీ దొరకదు. అందుకే ఎన్నికల్లో కిందిస్థాయి నేతల్ని, ఓటర్లని ఆకట్టుకోవాలంటే మద్యం తప్పనిసరిగా అందించాలి. లేదంటే ప్రచారంలో కూడా నేతలు కనిపించని పరిస్థితి నెలకొంటుంది. అందుకే ఎన్నికల్లో మద్యం పంపిణీ చేయడంపై ఏపీలో పార్టీలు దృష్టిపెట్టాయి. ఇప్పుడు దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
వైసీపీ ప్లాన్
అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అందుతుంది.. కాబట్టి, వాళ్ల ఓట్లు తమకు వస్తే చాలు గెలిచేస్తాం అనే ధీమాతో ఉంది వైసీపీ. తమకు రావాల్సిన ఓట్లు తమకే వచ్చేలా చూడటంతోపాటు, ప్రతిపక్షాలకు పడే ఓట్లను అడ్డుకోవడం కూడా ముఖ్యం అనుకుంటోంది వైసీపీ. అందుకే ప్రతిపక్షాలకు.. ముఖ్యంగా టీడీపీకి ఓట్లు పడేందుకు కారణమయ్యే మద్యాన్ని నియంత్రించాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీని అడ్డుకోగలిగితే అది టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుందని జగన్ నమ్మకం. అందుకే ఈ అంశంపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఎన్నికల సమయంలో మద్యం అందకుండా చేయాలనే లక్ష్యంతో చర్యలు ప్రారంభించారు.
పార్టీలు ఏం చేస్తాయి?
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీసహా ఇతర పార్టీలకు మద్యం పంపిణీ చేయడం తప్పనిసరి. ఇదేమీ బహిరంగంగా జరగకపోయినా.. ఏ ఎన్నికల్లో అయినా పార్టీలు ఈ పని చేయకతప్పదు. కానీ, మద్యం దొరక్కపోతే ఏం చేయాలి అన్నదే అసలు సమస్య. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం అనుమతించిన డిస్టిలరీలు మాత్రమే వివిధ బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నాయి. కాబట్టి, ఇవన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. ఇక ఎక్సైజ్, పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అందువల్ల మద్యం అమ్మకాల్ని నియంత్రించడం ప్రభుత్వానికి చాలా సులభం. ఇలాగైతే ఎన్నికల సమయంలో అవసరమైనంత మద్యం దొరకదు. పోనీ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిద్దామా అంటే అదీ కుదిరేపని కాదు. మద్యాన్ని నిల్వ చేయడం కూడా సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ ఉంది. ఇది ఇతర పార్టీలకూ ఇబ్బందే. ఏదో ఒకలా ఈ విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్త పడటం ముఖ్యం అని పార్టీలు, నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఫలితాల్ని ప్రభావితం చేయగల మద్యాన్ని నియంత్రించే ఆలోచన బాగానే ఉంది. అయితే, అది ప్రతిపక్షాల్ని దెబ్బతీసేందుకు మాత్రమే అయితే కష్టం.