Lok Sabha Elections: దేశంలో ముందస్తు ఎన్నికలు.. జమిలి ఎన్నికలకు బీజేపీ ప్లాన్..?

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బిహార్ సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభకు వచ్చే ఏడాదే ఎన్నికలు జరగాలనే రూలేం లేదని, ఈ ఏడాదే ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. జనవరిలోపు రాష్ట్రాలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తే మంచిదని సూచించారు.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 02:55 PM IST

Lok Sabha Elections: లోక్‌సభకు ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందా..? ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వచ్చాయా..? బిహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బిహార్ సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభకు వచ్చే ఏడాదే ఎన్నికలు జరగాలనే రూలేం లేదని, ఈ ఏడాదే ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. జనవరిలోపు రాష్ట్రాలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తే మంచిదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాదే అటు రాష్ట్రాలకు, ఇటు లోక్‌సభకు ఎన్నికలు జరగడం కూడా సాధ్యమేనని ఆయన చెప్పారు. దీన్నిబట్టి కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వెనుక బీజేపీ ప్లాన్ ఉందని అనుకుంటున్నారు.
ఎప్పటినుంచో ప్రణాళిక..
నిజానికి రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరపాలని బీజేపీ ఎప్పటినుంచో భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అనేకసార్లు పలు పార్టీలతో చర్చలు కూడా జరిపింది. దీనివల్ల ఆర్థికంగా నిధులూ మిగులుతాయని, సమయం ఆదా అవుతుందని, కేంద్రం, రాష్ట్రాలు.. రెండింటికీ ప్రయోజనం ఉంటుందని బీజేపీ ఆలోచన. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్ని కూడా నిర్ణయించగలవు. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్రాలకు, కేంద్రానికి కలిపి ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తమకే ప్రయోజనం ఉంటుందని బీజేపీ ఆశ.
సాధ్యమేనా..?
నిజానికి జమిలి ఎన్నికలు అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాల్సిందే. పోనీ ఐదేళ్లదాకా అయినా ప్రభుత్వం ఉంటుందా అన్న గ్యారెంటీ లేదు. మధ్యలోనే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. కొన్నిసార్లు తిరిగి ఎన్నికలు జరిపి కొత్తగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఐదేళ్లకు ముందే రద్దవుతున్నాయి. దీంతో కేంద్రంలో ఒకసారి.. రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అందువల్ల ఇన్ని రాష్ట్రాలున్న దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే పనికాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
బీజేపీ ప్లాన్ ఏంటి..?
లోక్‌సభకు వచ్చే ఏడాది వేసవిలో ఎన్నికలు జరగాలి. ఈ లోపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటక ఫలితాలతో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఫలితాలు కూడా వ్యతిరేకంగా వస్తే బీజేపీకి ఇబ్బందే. అందుకే ఆయా రాష్ట్రాలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరపాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ నిర్ణయం ఏ మేరకు అమలవుతుందో చూడాలి.