Madhya pradesh: అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం ఉచిత హామీల చుట్టూనే తిరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. అక్కడి పార్టీలన్నీ పోటీలు పడి మరీ ఉచిత పథకాల్ని ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అన్నింటికంటే ముందుంది. ఉచిత పథకాలను నమ్ముకునే కర్ణాటకలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. మధ్యప్రదేశ్‌లో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, అలాగే రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తామన్నారు.
మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 భృతి చెల్లిస్తామని పేర్కొంది. ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయడంతోపాటు, పాఠశాల విద్యను పూర్తి ఉచితంగా అందజేస్తామంది. నిరుద్యోగ యువతకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు రెండేళ్లపాటు అందిస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, రాష్ట్రానికి ఐపీఎల్ జట్టు ఏర్పాటు, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ వంటి హామీలు కూడా పొందుపరిచింది.
మొత్తం 59 రకాల హామీలిచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా కొనసాగుతున్నారు.