MAHARASTRA CM KCR: నాందేడ్ కు బయలుదేరిన కేసీఆర్ – గులాబీ వర్ణశోభితంగా రహదారులు

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 08:17 AM IST

బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి సభావేది వరకు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం కేసీఆర్‌ హోర్డింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గులాబీ తోర‌ణాల‌ను ఏర్పాటు చేశారు. ఉద్య‌మ‌కాలం నుంచి గులాబీ ద‌ళ‌ప‌తికి మ‌హారాష్ట్ర‌లో ఫాలోయింగ్ ఉంది. బీఆర్ఎస్ నాందేడ్ స‌భ‌కు మ‌హారాష్ట్ర వాసులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ఇక స్థానిక ప‌త్రిక‌ల్లో కేసీఆర్ క‌థ‌నాల‌ను ప్ర‌చురించారు. గోదాతీర్ అనే ప‌త్రిక‌లో స్థానిక నాయ‌కుడు ఒక‌రు బీఆర్ఎస్ యాడ్ ఇచ్చి ప్ర‌త్యేక దృష్టిని ఆక‌ర్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయల్దేరారు. ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనమయ్యారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం తెలంగాణ వెలుపల తొలిసారిగా నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.

ఎవరూ ఊహించని రీతిలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలుంటాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు చేరిపోయారు. నేటి సభలో పదుల సంఖ్యలో సర్పంచ్‌లు, నాందేడ్‌ జిల్లాకు చెందిన బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు చేరనున్నారు. ఇక సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా వెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2003, మార్చి 27 సువర్ణాక్షరంతో లిఖించబడింది. ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఆనాడు ఫలక్‌నుమా ప్యాలెస్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కారు ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీ హైదరాబాద్‌ నుంచి 100 కార్లతోనే మొదలవ్వగా దారి పొడవునా ప్రజలంతా తమ సొంత వాహనాలతో కేసీఆర్‌కు జేజేలు పలుకుతూ కదం తొక్కారు. అలా ఢిల్లీ బాటలో భారీ వాహన శ్రేణితో కేసీఆర్‌ ప్రత్యేకంగా వైర్‌లెస్‌ సెట్‌లో అందరినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగారు. ఈ అపురూప ఘట్టంలో మొదటి రోజు పెన్‌గంగ నదీ తీరంలో కేసీఆర్‌ బస చేశారు. మరునాడు మహారాష్ట్రలోని విదర్భ నుంచి బయల్దేరగా నాగ్‌పుర్‌లో వేల మంది కేసీఆర్‌కు జిందాబాద్‌ కొడుతూ స్వాగతం పలికారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత అదే మరాఠా గడ్డపై కేసీఆర్‌ సమావేశం ద్వారా ప్రజల్లోకి వస్తుండటం విశేషం. నాందేడ్ స‌భా వేదికపై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌, సంఘ సంస్క‌ర్త‌ల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశారు. మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్, మరట్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర‌హాల‌ను ఉంచారు.