Malla Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పాటు తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆరు నెలల్లో అధికారం మనదే అంటూ గులాబీ పార్టీ నేతలు బహిరంగంగా కామెంట్లు చేయడంతో.. అప్పుట్లో పెద్ద వివాదమే రేగింది. కాంగ్రెస్‌కు పెద్దగా మెజారిటీ లేదని.. రేవంత్ సర్కార్‌కు ప్రమాదమే అంటూ.. ఆ పార్టీ నేతలు చాలా కామెంట్లు చేశారు. నిజానికి బీజేపీతో పొట్టు పెట్టుకొని చక్రం తిప్పితే తప్ప అలాంటి పరిస్థితి రాదు. అది సాధ్యం కాదు కూడా అని అప్పట్లో చాలా అంచనాలు వినిపించాయ్. ఐతే ఆ తర్వాత ఆ ప్రచారం సైలెంట్ అయింది. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా పొత్తుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. దీనికి కారణం.. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటలే!
YS SHARMILA: షర్మిలను బలిచేస్తున్న కాంగ్రెస్.. ఆమెకు ఆ చాన్స్ ఎందుకివ్వలేదు?
మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయ్. రాష్ట్రంలో అధికారం కైవశం చేసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు దేశవ్యాప్తంగా 4వందల ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కూడా.. దక్షిణాదిలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఐతే శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే కారు పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ తెగేసి చెప్తున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో కారు, కమలం పొత్తు వ్యవహారంపై ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు.. రాజకీయంలో ఒక్కసారిగా సెగలు పుట్టించేలా చేశాయ్. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని.. కలిసే ఎంపీ ఎన్నికలు వెళ్తామంటూ మీడియా చిట్‌చాట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయ్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న బండి సంజయ్ మాటలను కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. ఇంకా తమ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్లతో ఎందుకు టచ్‌లో ఉంటారన్న మల్లారెడ్డి.. బండి సంజయ్‌తో అయ్యేది లేదు, పొయ్యేది లేదు అంటూ సెటైర్లు వేశారు. బీజేపీతో పొత్తు ఉన్నా.. మల్కాజ్‌గిరి టికెట్ బీఆర్ఎస్‌దేనని.. ఆ ఎంపీ టికెట్ చాలా భద్రంగా ఉందంటూ.. తన కొడుకు భద్రారెడ్డికే టికెట్ అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక తమ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారే ఆలోచనలో లేరు అన్నారు మల్లారెడ్డి. ఏమైనా బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అంటూ మల్లారెడ్డి రేపిన మంటలు.. రాజకీయాన్ని మరింత రగిలించడం ఖాయంగా కనిపిస్తోంది.