Death Toll: ఒడిశా ప్రమాద ఘటన మృతుల సంఖ్యపై అనేక అనుమానాలు! కేంద్రం నిజాలు దాస్తోందా?

అధికారిక మృతుల సంఖ్యకు అసలు మృతుల సంఖ్యకు తేడా ఉందా..? పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల్లో నిజమెంత?

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 10:09 AM IST

Death Toll: ఒడిశా బాలాసోర్ రైళ్ల ప్రమాద ఘటనలో కేంద్రం నిజాలను దాస్తోందా..? అధికారిక మృతుల సంఖ్యకు అసలు మృతుల సంఖ్యకు తేడా ఉందా..? పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల్లో నిజమెంత?
దొంగ లెక్కలు వేయడం.. పెద్ద ఘటనను తక్కువ చేసి చూపించడం.. మేటర్‌ని డైవర్ట్‌ చేయడం..తమ తప్పులను అంగీకరించకుండా పరనింద వేయడం కేంద్రానికి కొట్టిన పిండి. అది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ అయినా.. నాడు దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ అయినా తప్పుడు లెక్కలు సదా మాములే. మూడేళ్లు దేశాన్ని పట్టి పీడించిన కరోనా విషయంలోనూ దొంగ లెక్కలు చూపించారన్న విమర్శలు కేంద్రంతో పాటు మన తెలంగాణ సహా అనేక రాష్ట్రాలపై ఉంది. ఇప్పుడు ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలోనూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
దీదీ వ్యాఖ్యల్లో నిజమెంత?
ఒకప్పుడు నోరు విప్పితే బీజేపీపై కస్సుబుస్సుమంటూ పైకి లేచే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటివలి కాలంలో ఆ స్పీడ్‌ తగ్గించినట్టే అనిపించినా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈసారి ఆమె కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి బలమైన కారణముంది. దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై అటు సామాన్యుల నుంచి ఇటు ప్రతిపక్ష నేతలకు వరకు అందరిలోనూ పలు సందేహాలున్నాయి. ఘటన జూన్ 2 సాయంత్రం 7గంటల సమయంలో జరగగా.. తర్వాత రోజు ఉదయానికే మృతుల సంఖ్యను 233గా ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే పలు నేషనల్‌ మీడియా చానెళ్లలో సంఖ్య 280 దాటిందన్న బ్రేకింగ్‌లు కనిపించాయి. ఇండియా టూడే లాంటి వెబ్‌సైట్లలో సైతం సంఖ్యను 280 దాటినట్టు ప్రచురించారు. మరో 1,000మందికిపైగా గాయాలు పాలయ్యారని అధికారిక లెక్కలు కూడా చెప్పాయి. అయితే రైల్వేశాఖ లెక్కలు మాత్రం ప్రస్తుతం 275 దగ్గర ఆగాయి.
ఇదే విషయంపై మమత హాట్ కామెంట్స్ చేశారు. కేవలం తమ రాష్ట్రానికే చెందిన 61 మంది మృతి చెందారని, మరో 182 మంది ఆచూకీ తెలియకుండా పోయిందన్నారు మమత. ఈ లెక్కన.. అసలు గణాంకాలు సరైనవేనా అని ప్రశ్నించారు. దీంతోపాటు వందే భారత్‌ రైళ్ల ఇంజిన్లు సామర్థ్యం మేర ఉన్నాయా..? అని ప్రశ్నించారు. దీదీ పాయింట్‌లో లాజిక్‌ ఉందని ప్రతిపక్ష నేతలు సైతం ఆమె మాటలను సమర్ధిస్తున్నారు. కేవలం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే డెత్ టోల్ తగ్గించారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రిజర్వేషన్ చేయించుకోని వాళ్ల పరిస్థితేంటి..?
మన దేశంలో సీటింగ్‌ కెపాసిటీకి మించి ప్రయాణాలు చేయడం ఎయిర్‌వేస్‌ మినహా దాదాపు ప్రతి ట్రాన్స్‌పోర్టులోనూ జరిగేదే. ట్రైన్స్‌లో ఇది మరి ఓవర్‌గా కనిపిస్తుంది. రైలు బోగీల్లో ఊపిరి కూడా అడనివ్వనంత మంది ప్రయాణికులు కనిపిస్తుంటారు. అందులోనూ కోరమండల్‌ ట్రైన్‌ నిత్యం రద్ధీతో కిక్కిరిసిపోయే రైలు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కోరమండల్‌ ట్రైన్‌లో జనాల రద్దీ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అటు అధికారిక లెక్కల ప్రకారం ప్రమాదానికి గురైన కోరమండల్‌, యశ్వంత్‌పూర్‌ ట్రైన్స్‌లో వెయ్యికి పైగా ప్రయాణికులున్నారు. మరి టీసీని కాకాపట్టీ.. అనధికారికంగా ట్రైన్‌లో ఎక్కిన వారి సంఖ్య ఎంతన్నది చెప్పడం కష్టమే! ఇక ప్రమాదం తర్వాత బోగీల్లో శవాల కుప్పలు దర్శనమిచ్చాయి. అందులో చాలా వరకు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. అటు ఎక్కువ మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం కేంద్రానికి తలకు మించిన భారంలా మారుతుందని.. అందుకే డెత్‌ టోల్‌ని తగ్గించి చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.