మమత ప్రభుత్వంపై మమత ఉద్యమం.. ఇదేం దిక్కుమాలిన నిరసన దీదీ..

కోల్‌కతా హత్యాచారం కేసులో దోషులను శిక్షించకడంలో సీఎం మమతా బెనర్జీ ఫెయిల్ అయ్యారని.. ఆమెపై ఒత్తిడి తీసుకురావడంలో ఆరోగ్య శాఖ మంత్రి మమతా బెనర్జీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హోంమంత్రి మమతా బెనర్జీ నిరసనకు దిగారు.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 05:16 PM IST

కోల్‌కతా హత్యాచారం కేసులో దోషులను శిక్షించకడంలో సీఎం మమతా బెనర్జీ ఫెయిల్ అయ్యారని.. ఆమెపై ఒత్తిడి తీసుకురావడంలో ఆరోగ్య శాఖ మంత్రి మమతా బెనర్జీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హోంమంత్రి మమతా బెనర్జీ నిరసనకు దిగారు. మమతాపై మమతా.. ఆ పై మమత ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారా.. దీదీ తీరుతో ఇప్పుడు అందరికీ ఇదే గందరగోళం. ఘోరం జరిగింది తను అధికారం ఉన్న రాష్ట్రంలో.. హైలైట్ ఏంటంటే న్యాయం జరగాలి.. ఉరి తీయాలి అని మళ్లీ ఆమే నిరసనలకు దిగుతున్నారు. ఆరోగ్య శాఖ, హోం శాఖను తన దగ్గరే అట్టిపెట్టుకున్న సీఎం మమతా బెనర్జీ.. అన్ని శాఖల్లోనూ విఫలం అయ్యారు. పైగా దాన్ని కవర్ చేసుకునేందుకు ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు.

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం ఘటన.. దేశాన్ని రగిలిస్తోంది. 78ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఇదీ మహిళల పరిస్థితి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. జూనియర్‌ డాక్టర్‌కు న్యాయం చేయాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయ్. బెంగాల్‌ రణరంగంగా మారిపోయింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ.. కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక్కడే సెంటిమెంట్ గేమ్‌ మొదలుపెట్టింది దీదీ. సీబీఐకి డెడ్‌లైన్ పెట్టి మరీ.. దోషులను ఉరి తీయాలి అంటూ జనాలతో కలిసి నిరసనలకు దిగుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రతీ ఒక్కరి విచిత్రంగా అనిపిస్తోంది. ఘోరం జరిగినప్పుడు లేని హడావుడి, చేయని హడావుడి.. ఇప్పుడెందుకు దీదీ అని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇంత ఘోరం జరిగితే సాధారణ మరణంగా కేసు ఫైల్ చేశారు. ఆసుపత్రి సాక్షిగా ఘోరం జరిగితే.. సీఎం, హోం, ఆరోగ్య శాఖ మంత్రిగా కనీసం చర్యలు లేవు.

దీదీ అనుకుంటే.. క్షణంలో నిందితుడిని పట్టుకోవచ్చు.. ఇంకా ఏదైనా చేయొచ్చు. అలా జరగలేదు. పైగా దారుణం జరిగిన ప్రాంతంలో సరైన సోదాలు లేవ్‌. పైగా సాక్ష్యాలను చెరిపేసేందుకు సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయ్. దీదీ సర్కార్‌పై కోర్టుకే నమ్మకం లేక.. కేసును సీబీఐకి అప్పగించింది. ఇన్ని రకాలుగా ఫెయిల్ అయి.. ఇప్పుడు మీ దిక్కుమాలిన నిరసనలు ఏంటి అంటూ దీదీని ఆడుకుంటున్నారు. ఇంతకు మించిన చేతకాని తనం ఇంకోటి ఏమైనా ఉంటుందా అంటూ దీదీపై సోషల్‌ మీడియాలో భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయ్. బెంగాల్‌ సీఎంగా బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, న్యాయం కోసం రోడ్డెక్కడం.. మరీ విచిత్రంగా ఉంది. మొదటి నుంచి ఈ కేసును లైట్ తీసుకున్న దీదీ.. ఈ ఘటన దేశవ్యాప్తంగా హైలైట్ కావడంతో ఓవరాక్షన్ మొదలుపెట్టింది.

ఒకప్పుడు ఇదే సీబీఐ మీద నమ్మకం లేదని.. రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా చేసింది దీదీ. శారదా స్కాం సమయంలో సీబీఐ కేసులు నమోదు చేయగా.. విచారణ జరపకుండా దీదీ సర్కార్ అడ్డుకుంది. ఏకంగా వారిపై ఉల్టా కేసులు పెట్టింది. దాడులు కూడా చేయించింది. బెంగాల్‌లో సీబీఐకి ఎర్రజెండా చూపింది. అలాంటి సీబీఐకి ఇప్పుడు దీదీ.. అల్టిమేటం జారీ చేయడం ఏంటో.. ఈ దిక్కుమాలిన ఉద్యమం ఏంటో అని.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం పీకల మీదకు వస్తే.. ఎమోషనల్ పాలిటిక్స్ స్టార్ట్ చేయడం దీదీకి అలవాటు. కాలు విరిగిందని కట్టు కట్టుకున్నా.. తల పలిగిందని రుమాలు చుట్టుకున్నా.. ప్రతీ సెంటిమెంట్‌ సీన్ వెనక దీదీ రాజకీయమే ఉంటుంది.

ఇప్పుడు కూడా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. సీబీఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ద్వారా.. తప్పు కేంద్రానిది అని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి బెంగాల్ ప్రభుత్వానికి సత్తా ఉంటే.. అక్కడ పోలీసులు సరిగ్గా పని చేస్తే.. కేసు సీబీఐ దాకా ఎందుకు వెళ్తుంది… గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్లపై ఎందుకు దాడి చేస్తారు.. ఇలాంటి దిక్కుమాలిన ఉద్యమాలతో బెంగాల్ జనాలను దీదీ ఇంకెన్నాళ్లు పిచ్చోళ్లను చేస్తుందో మరి అనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత.. ఊడితే ఎంత.. దీదీ గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే.