AP Voter List: ఏపీలో బయటపడ్డ అక్రమ ఓట్లు.. రెండిళ్లలో 1300 ఓట్లు.. తప్పుల తడకగా ఓటర్ల జాబితా..!

ఏపీలో అక్రమ ఓట్ల గురించి ఫిర్యాదులు రావడం ఇదేం కొత్త కాదు. టీడీపీ హయాంలో కూడా ఇదే తరహా ఆరోపణలొచ్చాయి. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారని, లేని ఓట్లను సృష్టించుకున్నారని టీడీపీపై వైసీపీ అప్పట్లో విమర్శలు చేసింది. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 02:28 PM IST

AP Voter List: ఏపీకి సంబంధించి అక్రమ ఓట్ల విషయంలో ఎన్నో ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దొంగ ఓట్లు సృష్టిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వివిధ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటుగా నుంచి స్థానిక అధికారులకు కూడా పార్టీలు, సంఘాలు, వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఏపీలో కొన్ని చోట్ల అక్రమ ఓట్లు భారీ స్థాయిలో బయటపడ్డాయి.
విజయవాడలో ఒక ఇంటికి డోర్ నెంబర్ లేదు. కానీ, 650 ఓట్లు మాత్రం ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒకే ఇంట్లో 706 ఓట్లున్నాయి. మచిలీపట్నంకు సంబంధించి పట్టణ ఓటర్లు రూరల్‌కి, రూరల్ ఓటర్లు మచిలీపట్నం పట్టణానికి మారిపోయాయి. విశాఖపట్నంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అక్రమ ఓట్లు కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో అధిక ఓట్లు కొన్ని చోట్ల ఉంటే.. ఇంకొన్ని చోట్ల మనుషులు ఉన్నా.. వారి పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదు. ఇలా చెప్పుకొంటూ పోతే.. ఏపీలో ఓటర్ల జాబితాకు సంబంధించి జరిగిన పొరపాట్లు, అక్రమాలు ఎన్నో..! ఈ జాబితాపై కొన్ని చోట్ల కోర్టులో పిటిషన్లు, ఫిర్యాదుల వరకు వెళ్లింది వ్యవహారం. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో అక్రమ ఓట్లు, ఓటర్ల జాబితాలో తప్పులు బయటపడటంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా వెల్లడైన ఓటర్ల జాబితా ఈ తప్పులకు కారణమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితాలో తప్పుల్ని అంగీకరించింది. అసలైన ఓట్ల గల్లంతు, దొంత ఓట్ల సృష్టి ఉద్దేశ పూర్వకంగా జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతోంది.
ఏపీలో ఎప్పుడూ వివాదాస్పదమే
ఏపీలో అక్రమ ఓట్ల గురించి ఫిర్యాదులు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో టీడీపీ హయాంలో కూడా ఇదే తరహా ఆరోపణలొచ్చాయి. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారని, లేని ఓట్లను సృష్టించుకున్నారని టీడీపీపై వైసీపీ అప్పట్లో విమర్శలు చేసింది. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. కొందరు ఓటర్లు మరణించినప్పటికీ వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కనిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. ఓటర్ల లిస్టులో పేరు ఉన్న వాళ్లలో కొందరు స్థానికేతరులు ఉన్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నెంబర్ మీద 500 ఓట్లు, ఇంకొన్ని చోట్ల 600 ఓట్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విజయవాడ, గుంటూరుతోపాటు చాలా చోట్ల అక్రమ ఓట్లు బయటపడ్డాయి. 2,100 చోట్ల 50కి పైగా ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమాలే అంటే స్థానికులు, పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుగుణంగా ఓటర్ల జాబితా రూపొందుతోందనే విమర్శ ఉంది. తమకు అనుకూలంగా ఉండే వారి పేర్లను జాబితాలో ఉంచడం, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలిసిన వారి పేర్లను లిస్టు నుంచి తొలగించడం అధికార పార్టీలు చేసే పని అని ఏపీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మొదలైన సర్వే
ఎన్నికల సంఘం అధికారులు ప్రతి ఏటా ఓటర్ల జాబితాను సవరిస్తుంటారు. మరణించిన వారి పేర్లను ఆ ఏడు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు కొత్త వారి పేర్లను చేరుస్తుంటారు. ఇంటి నెంబర్లు, ఇతర వివరాల్ని మార్చుకునేందుకు దీనిలో అవకాశం ఉంటుంది. తర్వాత సవరించిన ఓటర్ల జాబితాను అధికారులు రూపొందించి, విడుదల చేస్తుంటారు. ఇంత జరుగుతున్నా ఏపీలో అక్రమ ఓట్లు భారీగా బయటపడుతున్నాయి. దీని వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించాలి. ఇందుకోసం బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే చేయాలి. ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల జాబితాను పరిశీలించి తుది మార్పులు చేయాలి. ఈ ఏడాదికి సంబంధించి జూలై 21, శుక్రవారం నుంచి ఇంటింటి సర్వే మొదలవుతుంది. ఈ సర్వే ద్వారా అక్రమాలు సరి చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈసారి జాబితాను మరింత జాగ్రత్తగా రూపొందించాలి. ఎందుకంటే అక్రమ ఓట్లు భారీ స్థాయిలో బయటపడ్డాయి. వీటిపై ప్రతిపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టిపెట్టింది. రాష్ట్ర ఈసీ అధికారులను పిలిపించి మాట్లాడింది. దీంతో తర్వాత ప్రకటించబోయే ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చేస్తామని సీఈసీకి రాష్ట్ర అధికారులు తెలిపారు. రాబోయే జాబితాలో తప్పులు లేకుండా చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు.