అధికారంలోకి రావడం.. డబుల్ ఇంజిన్ అని గొప్పలు పోవడం.. వర్గాల మధ్య చీలకలు తీసుకురావడం.. రాజకీయ లబ్ది కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ ట్రేడ్ మార్క్ రాజకీయం. కొన్ని రాష్ట్రాల్లో రచ్చ జరగకపోయినా.. ఈ పరిణామాల ఇంపాక్ట్ భవిష్యత్‌లో పడుతుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం కమలం పార్టీ తీసుకున్న ఎఫెక్ట్ చాలా త్వరగా కనిపించింది. దాని ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం. ఈ ఏడాది మార్చి 27న మేయితేయీ గ్రూపును షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని మణిపూర్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాజుకున్న హింసాగ్ని ఇప్పటికీ చల్లారడం లేదు. మే 3న మొదలైన గొడవలు, అల్లర్లు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయంటే తప్పు ఎవరిది..? ఇందులో కేంద్రప్రభుత్వ వైఫల్యం లేదా..?
దాదాపు 45 రోజులుగా మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో ఓ మహిళతో పాటు మరో 9 మంది మరణించారు. మణిపూర్‌ని ఓ చర్చిలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడటంతో.. ఒక మహిళతో పాటు 10 మంది మరణించాగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఇంఫాల్‌లోని ఖమెన్‌లోని ఓ చర్చిలో మంగళవారం రాత్రి దుండగులు కాల్పులకు దిగినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిగే సమయంలో చర్చిలో 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారు ప్రస్తుతం ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాలతో మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 115కి చేరింది. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు ప్రతిపక్ష నేతలు.
మణిపూర్ హింసపై మౌనమెందుకు ?
దేశంలో జరిగే ప్రతి చిన్న విషయానికి ఆఘమేఘాలపై స్పందించి చర్యలు తీసుకోవాలని.. పరిస్థితిని చక్కదిద్దలని ఆదేశాలు జారీ చేసే ప్రధాని మోదీకి ఈశాన్య రాష్ట్రాలంటే చిన్నచూపు అని స్పష్టమవుతుంది. హింసాకాండతో మణిపూర్ అట్టుడుకుతున్నప్పటికీ ప్రధాని మౌనం వహించడాన్ని ఇప్పటికే పది ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. నిజానికి మణిపూర్‌లో హింసాగ్నికి ఆజ్యం పోషింది పాలక పెద్దలేనన్న విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్‌కు, బీజేపీ రాజ్యసభ సభ్యులు లెయిసెంబా సనజావోబాకు ప్రమేయముందని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి పాత్రపై దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుండగా.. కేంద్రం మాత్రం హడావుడి టూర్లకు, పేపర్ ప్రకటనలకే పరిమితమవుతోంది.
హొంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగినట్టు అనిపించినా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు కనిపించడలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు దాపరించాయి. నిత్యం ఏదో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిని స్థాపిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపినా ఏ ప్రయోజనం లేకపోగా… ప్రాణ నష్టం అంతకంతకూ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. తీవ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం ప్రకటనలు చేసుకుంటోంది.
అసలు వివాదం ఏంటి…?
మణిపూర్ జనాభాలో మైతీ సామాజిక వర్గం 53 శాతం ఉంటుంది. ముఖ్యంగా ఇంఫాల్ లోయలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వీరిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దీంతో మైతీ వర్గానికి గిరిజన హోదా ఇవ్వడంపై స్థానిక గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాలి మాట్లాడే మైతీ తెగ ప్రజలు బ్రాహ్మణ వర్గం వారు. ప్రధానంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్థానికంగా ఎస్టీ హోదా అనుభవిస్తున్న గిరిజనులు ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా క్రైస్తవ మతం ఆచరిస్తుంటారు.మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటంపై మొదటి నుంచి గిరిజన తెగలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మైతీలు ఏమంటున్నారు?
మియన్మార్,బంగ్లాదేశ్‌నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా అక్కడి ప్రజలు మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మైతీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.