Margadarsi: మార్గదర్శి కథ ముగిసిందా ? ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

చిట్ ఫండ్ చట్టాల నిబంధనలన్నింటినీ మార్గదర్శి తుంగలో తొక్కిందని, మార్గదర్శిని మూసేయాలని ప్రాధమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు హిందూతో పాటు అనేక పత్రికల్లో ఫుల్ పేజ్ ప్రకటన జారీ చేసింది.

  • Written By:
  • Updated On - July 30, 2023 / 09:24 AM IST

Margadarsi: చంద్రబాబు,- జగన్ మధ్య కాకరేపుతున్న పొలిటికల్ వార్ చివరకు మార్గదర్శి మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. మార్గదర్శి ఖాతాదారులెవరూ ఒక్క ఫిర్యాదు చేయకపోయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. చిట్ ఫండ్ చట్టాల నిబంధనలన్నింటినీ మార్గదర్శి తుంగలో తొక్కిందని, మార్గదర్శిని వైండ్ అప్ ( మూసేయాలని) చేయాలని ప్రాధమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు హిందూతో పాటు అనేక పత్రికల్లో ఫుల్ పేజ్ ప్రకటన జారీ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారులకు నోటీసులు అన్న పేరుతో జారీ చేసిన ఈ ప్రకటనలో దర్యాప్తులో తేలిన అనేక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది
మార్గదర్శి చేసిన 7 తప్పులు
* మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న చిట్ సంస్థలో టిక్కెట్ ఉన్న వారికి సబ్‌స్క్రిప్షన్ మనీని మార్గదర్శి నుంచి కాకుండా వేరే చిట్ గ్రూప్ నుంచి చెల్లించారు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం కంపెనీ పేరుతో ఉన్న చిట్ ( ఖాళీ చిట్) కు సొమ్ములను కంపెనీయే చెల్లించాలి. కానీ అలా జరగడం లేదని, నిధులు లేక వేరే కంపెనీ నుంచి చెల్లిస్తున్నారని రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ చెబుతోంది
* చిట్ కంపెనీ నుంచి పేమెంట్స్ చెల్లించకుండా ఇతర గ్రూపుల నుంచి నిధులను మళ్లించి చెల్లిస్తున్నారు. మార్గదర్శి సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒక్కోసారి ఖాతాదారులకు చెల్లింపులు మూడు నాలుగు నెలలు ఆలస్యమవుతున్నాయి.
* చిట్ ఫండ్ యాక్ట్​లోని అన్ని నిబంధలను ఉల్లంఘించి అన్ని అనుమతులతో కొత్త చిట్ ప్రారంభించడానికంటే ముందే నిధులను సేకరిస్తున్నారు.
* చిట్ పాడుకున్న ఖాతాదారులకు నిబంధనల ప్రకారం మొత్తం చెల్లింపులు జరగడం లేదు. ఫ్యూచర్ లయబిలిటీ పేరుతో చెల్లింపులు జరపకుండా ప్రైజ్ మనీని తమ దగ్గరే డిపాజిట్ చేయించుకుంటున్నారు. దీనికి 4-5 శాతం వడ్డీ ఇస్తున్నట్టు చెబుతున్నారు
* 1982 నాటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం బ్రాంచ్ లో ఫోర్ మెన్ మాత్రమే చిట్ లను నిర్వహించాలి. కానీ కార్పోరేట్ ఆఫీసు నుంచి అనధికారిక వ్యక్తులు ఈ పని చేస్తూ నిధులను మళ్లిస్తున్నారు.
* మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారులకు పెద్ద ఎత్తున బకాయిలు పడటమే కాకుండా భారీగా నిధులను మళ్లించింది.
* చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం సంస్థ ఆదాయ వ్యయాలను, బ్యాలెన్స్ షీట్ ను చిట్ ఫండ్ అధికారులకు సమర్పించడంలో విఫలమైంది
ఇలా 7 ఉల్లంఘనలను పత్రికాముఖంగా ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్.. మార్గదర్శిని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించింది.
తమ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా చెప్పాలని కోరింది. ఈ ప్రకటన చూస్తే ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్ ను శాశ్వతంగా మూయించేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎల్లో మీడియా అంటూ నిత్యం ఈనాడు, రామోజీరావుపై విమర్శలు గుప్పించే జగన్.. చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా మార్గదర్శి వ్యవహారాన్ని వాడుకుంటున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఈ ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టించక మాదను. దీనిపై మార్గదర్శి ఎలా ముందుకెళుతుంది, టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.