MATTA RAGAMAYI: సత్తుపల్లి నియోజకవర్గంనుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి జిల్లాలోనూ ఏకైక మహిళా ఎమ్మెల్యే తానే కావడం మరో విశేషం. సత్తుపల్లి నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఏనాడు మహిళలకు అవకాశం దక్కలేదు. కానీ.. డాక్టర్ రాగమయి మాత్రం తొలి ప్రయత్నంలోనే హాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై భారీ మెజార్టీతో గెలిచారు.
REVANTH REDDY: మంత్రి పదవులెన్ని..? పోటీ పడుతోంది ఎందరు..?
వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు సుపరిచితురాలైన రాగమయి.. ఇప్పుడు ప్రజా సేవలోనూ ప్రజలతో మమేకం కానున్నారు. రాగమయి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త దయానంద్ సత్తుపల్లిలో కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆమె అత్త డాక్టర్ మట్టా ఆరోగ్యం ఎంపీపీగా పనిచేశారు. మామ మట్టా కృష్ణమూర్తి స్వాతంత్య్ర సమరయోధుడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న రాగమయి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె భర్త దయానంద్ రెండువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత వైద్యవృత్తికే అంకితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా దయానంద్ పోటీకి దిగాలని భావించినా కులధ్రువీకరణపై వివాదం తలెత్తడంతో రాగమయి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే టికెట్ సాధించిన రాగమయి.. విస్తృతంగా ప్రచారం చేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాగమయికి 1,09,449 ఓట్లు కాగా, సండ్ర వెంకటవీరయ్యకు 90,974 ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఆమె 19,464 ఓట్ల మెజార్టీ సాధించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తన కూతురు అకాల మరణంతో ఆషా పేరిట స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్న రాగమయి.. ఇప్పుడు ఆ ప్రజలకు ప్రతినిధిగా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.