Parmanand Tolani: 18 సార్లు ఓటమి.. అయినా ఎన్నికల బరిలోకి దిగుతున్న పరమానంద్..

నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి పరమానంద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాడో కూడా చెప్పాడు.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 07:25 PM IST

Parmanand Tolani: ఎన్నికల్లో ఒకట్రెండుసార్లు పోటీ చేసి ఓడిపోతేనే.. మళ్లీ పోటీ చేయడానికి ఆలోచిస్తారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఇప్పటికి ఏకంగా 18సార్లు పోటీ చేసి, ఓడిపోయినప్పటికీ మరోసారి పోటీకి రెడీ అవుతున్నాడు. ఆయనే మధ్యప్రదేశ్‌కు చెందిన పరమానంద్ తోలానీ. దాదాపు 35 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్‌లో జరిగిన అనేక ఎన్నికల్లో పరమానంద్ పోటీ చేశారు. పరమానంద్ తండ్రి కూడా అంతకుముందు 30 ఏళ్లపాటు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణానంతరం 1989లో పరమానంద్ తొలిసారి పోటీ చేశారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ, లోక్‌సభ, మేయర్ సహా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తంగా 18 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్లు కూడా దక్కలేదు. అయినప్పటికీ తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకసారి తన భార్యను కూడా ఎన్నికల్లో నిలబెట్టారు. ఆమె కూడా ఓడిపోయారు. మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి పరమానంద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాడో కూడా చెప్పాడు. స్థానికంగా ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పరమానంద్ మీడియాతో మాట్లాడారు. “ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ డిపాజిట్ కోల్పోతున్నప్పటికీ మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంది. ఇందౌర్ ప్రజలు ఏదో ఒక రోజు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నప్పటికీ పరమానంద్ పోటీ చేయడాన్ని చాలా మంది సమర్ధిస్తున్నారు. అయితే, ఈసారైనా పరమానంద్ గెలుస్తాడో, లేదో చూడాలి. పరమానంద్ కంటే ఎక్కువసార్లు పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కాకా జోగిందర్ సింగ్ దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తంగా 300 సార్లు పోటీ చేసి ఓడిపోయి, రికార్డు కూడా సృష్టించారు. కాకా జోగిందర్‌ను అందరూ ధర్తి పకడ్‌గా పిలిస్తే, పరమానంద్‌ను ఇందౌర్ ధర్తి పకడ్‌గా పిలుస్తున్నారు.