Harishrao on Meters : మోటార్లకు మీటర్ల అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బధ్దలు కొట్టారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్. నిర్మల సీతారామన్ బీజేపీతో పాటు కాంగ్రెస్ బండారం కూడా బయటపెట్టారు. దేశంలో 12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నారు. కేసీఆర్ ఉన్నందునే తెలంగాణలో అది ఇక్కడ సాధ్యం కాలేదు. రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయి. ఒకవేళ తప్పిపోయి తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారని రైతులు గుర్తుంచుకోవాలన్నారు హరీష్.
రెండు పార్టీలు రైతులను దగా చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీపాలిత యూపీ, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారు. ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళలో పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కి సంబంధం లేని ఎపీ, మేఘాలయ రాష్ట్రాల్లోనూ మీటర్లు పెట్టారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టనని ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు. 69 లక్షల రైతుల ప్రాణాలు మాకు ముఖ్యమనీ… 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్టేనని గుర్తుపెట్టుకోవాలని హరీష్ రావు చెప్పారు.
అప్పుల గురించి మీరా చెప్పేది ?
అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటని అన్నారు మంత్రి హరీష్ రావు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి దేశం మీద ఉన్న అప్పు దాదాపు రూ.55 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.155 లక్షల కోట్లు దాటింది. అంటే ప్రతి నెలా దాదాపు లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత బీజేపీది. మీరు వచ్చి మాకు చెప్పడం గురువింద సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు హరీష్ రావు. పైగా అప్పులు తగ్గిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరమన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. 9 ఏళ్లు అయ్యింది 18 కోట్ల ఉద్యోగాలు ఏవి? కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొంత జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. మరొకటి లేదని హరీష్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఫస్ట్ నే వేతనం ఇచ్చేలా చూస్తాం. నాడు జీతాలు, ఫించనర్లపై 18 వేల కోట్లు ఖర్చు చేస్తే… ఇప్పుడు 60వేల కోట్లు ఖర్చవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతాం. కాంగ్రెస్ నమ్మితే ఆగమవుతామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎంతోమంది ప్రమోషన్లు డబుల్ ప్రమోషన్లు పొందారు. ఉపాధ్యాయ ఉద్యోగులు, ఫించనర్లు, చిరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నా అన్నారు హరీష్.