Top story: లెక్క తప్పుతున్న ఎగ్జిట్ పోల్ అంచనాలు నిన్న లోక్‌సభ…నేడు హర్యానా, జమ్మూకశ్మీర్‌

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు విరుద్ధంగా రిజల్ట్స్‌ వచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా అధికారాన్ని చేపడుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అలాగే జమ్మూకశ్మీర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని...హంగ్‌ ఏర్పడుతుందని చెప్పాయి.

  • Written By:
  • Updated On - October 9, 2024 / 06:03 PM IST

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు విరుద్ధంగా రిజల్ట్స్‌ వచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా అధికారాన్ని చేపడుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అలాగే జమ్మూకశ్మీర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని…హంగ్‌ ఏర్పడుతుందని చెప్పాయి. మాట్రిజ్‌, మై యాక్సిస్‌ ఇండియా, దైనిక్ భాస్కర్‌, పీపుల్స్‌ పల్స్‌ సంస్థల సర్వేలన్నీ పటా పంచలయ్యాయి. ఒక్కటంటే ఒక్క సంస్థ అంచనాలు కూడా నిజం కాలేదు. హర్యానాలో కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడుతుందని సర్వేలు చెబితే…బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు 48 చోట్ల సాధించింది. మేజిక్‌ ఫిగర్‌ 46 సీట్లయితే…రెండు సీట్లు ఎక్కువే గెలిచింది. ఎన్నికల ముందు ఆ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు ఫెయిల్ అయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు డేరా సచ్చా సౌదా చీఫ్‌ డేరా బాబా ఆలియస్‌ గుర్మిత్‌ రామ్‌ రహిమ్‌ సింగ్‌…20రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావడం బీజేపీకి కలిసి వచ్చింది. తన అనుచరులు, భక్తులందర్ని బీజేపీకి ఓటు వేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎవరు వేయవద్దని…బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తన అనుచరులతో ప్రచారం చేయించారు. తాను కూడా పలు ప్రాంతాల్లో తిరిగి…కాషాయ పార్టీకి అనుకూలంగా పని చేశారు. దీంతో కమలం పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడుతుందని సర్వేలు చెబితే…ఆ పార్టీ 37 సీట్లకే పరిమితం అయింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ జాట్లు, రైతుల చట్టాలు, రైతుల ఆందోళన అణచివేతను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. ముచ్చటగా మూడోసారి చతికిల పడింది. హస్తం పార్టీ జాట్లు, అన్నదాతల సమస్యలే ప్రచారాస్త్రంగా వాడుకుంటే…బీజేపీ దళితులు, ఇతర వర్గాల ఆకట్టుకొని ఎన్నికల్లో సక్సెస్ అయింది.

జమ్మూకశ్మీర్‌లో హంగ్‌ వస్తుందని సర్వేలు చెబితే…నేషనల్ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి 49 సీట్లు సాధించింది. బీజేపీ 29 సీట్లతో సరిపెట్టుకుంటే…పీడీపీ మూడు స్థానాలకే పరిమితం అయింది. ఇక్కడ 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదా అంశాలే ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఒమర్ అబ్దుల్లా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 350 స్థానాలు సాధిస్తుందని ప్రముఖ సర్వేలన్ని హోరెత్తించాయి. చివరికి ఆ పార్టీ 240 స్థానాలకే పరిమితం అయింది. మెజార్టీకి అవసరమైన 272 సీట్లను కూడా సాధించలేకపోయింది. జేడీయూ, టీడీపీ వంటి కూటమి పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి. ఇక్కడ భూపేష్‌ బఘేల్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెబితే…బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

కొంతకాలంగా సర్వే సంస్థల అంచనాలన్నీ మిస్‌ ఫైర్ అవుతున్నాయి. ఒక్క సర్వే సంస్థ అంచనాలు కూడా ఫలితాల్లో ప్రతిబింబించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. సర్వే సంస్థలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్‌…వైసీపీకి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయని..అసెంబ్లీ స్థానాలను పేర్లను కూడా వెల్లడించాడు. గతంలో ఆరా మస్తాన్‌ చేసిన సర్వేలన్నీ నిజమవడంతో…ఆయన సర్వేను ప్రజలు కూడా గుడ్డిగా నమ్మారు. జిల్లాల వారీగా జాబితా ప్రకటించడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. భారీగా బెట్టింగ్‌ వేసుకున్నారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే…సీన్‌ రివర్స్ అయింది. జగన్మోహన్‌రెడ్డి పార్టీ జస్ట్‌ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చాయి. టీడీపీ చరిత్రలో ఎన్నడు రానన్ని సీట్లు వచ్చాయి. తన సర్వే వందశాతం నిజమవుతుందని ఆరా మస్తాన్‌ బల్లగుద్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆయన్ను నమ్ముకొని బెట్టింగ్‌ వేసిన వారంతా….ఫలితాల తర్వాత బండబూతులు తిట్టారు.

ప్రజలు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సర్వే సంస్థలను బట్టి…తమ మనసులో మాటను బయటకు చెబుతున్నారు. పోలింగ్‌ సమయానికి తాము ఏం చేయాలో…అదే చేస్తున్నారు. సర్వే సంస్థల గురించి ముందుగానే అంచనా వేసుకుని…వారికి అనుకూలంగా చెబుతున్నారు. మంచి పథకాలు ప్రవేశపెట్టారని…ప్రభుత్వం బాగా చేస్తోందని పైకి చెబుతున్నారు. లోపల మాత్రం ఇంకొంటి చేస్తున్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల నుంచి నిన్న వెల్లడైన జమ్మూకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాల వరకు ఇదే జరిగింది. కొన్ని సర్వే సంస్థలు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో…ప్రజలు కూడా వారికి ఫేవర్‌గా చెబుతున్నారు. పోలింగ్‌ బూత్‌లో మాత్రం తాము ఎవరికి ఓటు వేయాలో…కచ్చితంగా వారికే వేస్తున్నారు. దీంతో సర్వే సంస్థల అంచనాలన్నీ ఫెయిల్‌ అవుతున్నాయి.