MLA Raghunandan Rao: బీజేపీపై అసంతృప్తిలో రఘునందన్ రావు.. బండిపై ఫైర్.. దేనికి సంకేతం..?

పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నాకు తగిన పదవి కావాలి. తెలంగాణ అధ్యక్ష పదవి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి.. జాతీయ అధికార ప్రతినిధి పదవి.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నా. నేను అధ్యక్ష పదవికి ఎందుకు అర్హుడిని కాను.

MLA Raghunandan Rao: బీజేపీలో ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తి వ్యవహారం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో నెమ్మదిగా అసంతృప్తి గళం వినిపించిన రఘునందన్ రావు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై, పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అధ్యక్ష పదవికి తాను ఎందుకు అర్హుడిని కానంటూ ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే..
”పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నాకు తగిన పదవి కావాలి. తెలంగాణ అధ్యక్ష పదవి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి.. జాతీయ అధికార ప్రతినిధి పదవి.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నా. నేను అధ్యక్ష పదవికి ఎందుకు అర్హుడిని కాను. కొన్నిసార్లు నా కులమే శాపంగా మారింది. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా దుబ్బాక నుంచి గెలుస్తా. దుబ్బాకలో అమిత్ షా వచ్చి ప్రచారం చెయ్యలేదు. నాకు ఎన్నికలో ఎవరూ సాయం చేయలేదు. నేను పార్టీలోనే ఉండాలనుకుంటున్నా. మునుగోడులో వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా బీజేపీ గెలవలేకపోయింది. నేను దుబ్బాకలో సొంతంగానే గెలిచా. అదే.. వంద కోట్లు నాకు ఇచ్చి ఉంటే తెలంగాణను దున్నేసేవాడిని. అమిత్ షా.. రాజగోపాల్ రెడ్డి భుజంపై చేయి వేసి రాజీనామా చెయ్ గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఐతే చివరికి గెలిపించలేకపోయారు. కేసీఆర్‌ను కొట్టే మొనగాడిని నేనే అని జనాలు నమ్మారు.

దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. బీజేపీని చూసి కాదు. తనకంటే ముందు బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి అక్కడ 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయి. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధం. ఒకప్పుడు పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండికి ఇప్పుడు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. పార్టీ డబ్బులో నాకూ వాటా ఉంది. పేపర్ యాడ్స్‌లో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఫొటోలు కాదు.. రఘునందన్, ఈటల రాజేందర్ ఫొటోలుంటే ప్రజలు ఓట్లు వేస్తారు. బీజేపీకి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేడనే విషయం జాతీయ అధ్యక్షుడు నద్దాకు తెలియదు. ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే నిజమేనా అంటూ నన్నే అడిగారు. నేను ఉప ఎన్నికల్లో గెలిచినందువల్లే ఈటెల బీజేపీలో చేరారు. బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలు నిజమే. ఇంతకాలం నాకంటే ఎక్కువగా పార్టీ కోసం ఎవరూ కష్టపడలేదు. నా సేవలకు ప్రతిఫలం దక్కకపోతే నద్దాపై మోదీకి ఫిర్యాదు చేస్తా.” అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రఘునందన్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ వర్గాల్లో మంటలు రేపుతున్నాయ్.
ఘాటైన విమర్శలే
ఈ స్థాయిలో బీజేపీ నాయకత్వంపై, బండి సంజయ్‌పై రఘునందన్ రావు ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ఎప్పట్నుంచో పార్టీపై, నాయకత్వంపై ఉన్న ఆగ్రహాన్ని తాజాగా బయటపెట్టినట్లైంది. రఘునందన్ అసంతృప్తితో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగినా ఎప్పుడూ బయటపడలేదు. తాజా వ్యాఖ్యల ద్వారా బీజేపీతో ఆయన తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా అనిపిస్తోంది. రఘునందన్ రావు అనే కాదు.. బీజేపీకి చెందిన జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, విజయశాంతి, ధర్మపరి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. అంటే రఘునందన్ లాగా మిగతా నేతలు విమర్శలు చేయకపోయినా.. వాళ్లలో అసంతృప్తి నిజమే అనిపిస్తోంది.
చక్కదిద్దే పనిలో అధిష్టానం..
తెలంగాణ బీజేపీలో ముసలంపై అధిష్టానానికి అవగాహన ఉంది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఇటీవల పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు కూడా చేశారు. కొందరితో అధిష్టానం మాట్లాడింది. అయితే, ఇంకా విబేధాలు కొనసాగుతున్నాయి. దీనంతటికీ కారణం.. బండి సంజయ్ వైఖరే అని హైకమాండ్ గుర్తించింది. అందుకే బండిని తొలగించి, మరొకరికి బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు ఇచ్చి, బండికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. లేదంటే జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై చర్చించేందుకు బండి ఢిల్లీ వెళ్లారు. అక్కడ చర్చల తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈటల, కోమటిరెడ్డి వంటి నేతలు కూడా పార్టీ పదవులు ఆశిస్తున్నారు. అసంతృప్తులందరికీ ఏదో ఒక పదవి అప్పజెప్పి, బుజ్జగిస్తేనే పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది.