Ysrcp: దెబ్బ తగిలినా వీళ్లు మారరా ? వైసీపీ పతనం మొదలైనట్లేనా ?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. రాయలసీమ తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ ఎగురేసుకుపోయింది. 3స్థానాలు అని కొట్టేయడానికి లేదు.. ఒకరకంగా 108 నియోజకవర్గాల్లోని పట్టభద్రుల తీర్పు ఇది ! ఇంత జరుగుతున్నా.. వైసీపీలో మాత్రం మార్పు కనిపించడం లేదు. పైగా ఇది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆ పార్టీ పెద్దలు ! సజ్జల వ్యాఖ్యలు చూస్తే అదే అర్థం అవుతోంది.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 04:00 PM IST

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం పక్కనపెట్టి.. అసలు ఓటమిని ఒప్పుకోకపోవడం వైసీపీ అహంకారానికి అద్దంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ ఓటర్లవి అసలు ఓట్లే కాదన్నట్లు.. తేలికగా చెప్పేశారు సజ్జల. ఇప్పటికై వైసీపీ నిద్రలేవాలి. ప్రమాదం ముంచుకు రాబోతుందని గ్రహించాలి. యువతలోనూ, మధ్యతరగతి జనాల్లోనూ మద్దతు కోల్పోయిన ఏ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు.

ఈ విషయం ఒప్పుకోకుండా.. మా ఓటర్లు వేరు.. మా విధానాలు వేరు.. మాకొచ్చే ఓట్లు వేరు.. మీడియాతో మేనేజ్‌ చేస్తాం.. సోషల్‌ మీడియాతో కవర్ చేస్తాం అనుకుంటే.. సుడిగుండంలో స్విమ్మింగ్‌కు సిద్ధమైనట్లే ! సజ్జల మాటలు, ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థం అవుతోంది. క్షేత్రస్థాయిలో నిజాలు జగన్‌ వరకు వెళ్లడం లేదు అన్నది క్లియర్‌. టీడీపీ మూడు స్థానాలు గెలిచింది కదా అని.. ఇప్పటికిప్పుడు వైసీపీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే.. అదే తప్పు ఎక్కడ జరిగింది అని గుర్తించడం.

అది మానేసి.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అంటూ అతడులో షియాజీ షిండేలా అంటే.. ఏదో రోజు ఓటమి బుల్లెట్‌లా దూసుకురావడం ఖాయం. తెలివి రావాలంటే రోజూ ఏదో ఒకటి నేర్చుకోవాలి.. అదే జ్ఞానం రావాలి అంటే.. రోజుకొకటి వదిలేయాలి.. ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలనేది తేల్చుకోవడమే పరిణతి ! వైసీపీకి ఇప్పుడు అదే అవసరం. వాపును చూసి బలుపు అనుకుంటే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్సీ ఫలితాల్లో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలి.. దాన్ని కవర్ చేసుకోవాలి. లేదంటే.. పతనం ఇప్పటి నుంచే మొదలవుతుందన్న విషయం గ్రహించాలి.