గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఆక్సిజన్‌లా మారితే ఆ పార్టీతో పొత్తుకోసం తహతహలాడుతున్న జనసేనకు మాత్రం షాక్‌లా తగిలాయి. టీడీపీకి మెజారిటీ రావడం జనసేన బేరసారాల శక్తిని తగ్గిస్తుందేమో అంటున్నారు పొలిటికల్ పండిట్స్. జనసేన అడిగినన్ని టీడీపీ ఇచ్చే పరిస్థితి నుంచి టీడీపీ ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయని జనసేనకు ఈ ఫలితాలు షాకే… తమ భవిష్యత్ మిత్రపక్షం గెలిచినందుకు సంతోషపడాలో లేక ఈ గెలుపు ప్రభావంతో టీడీపీ సీట్ల కేటాయింపులో కొండెక్కి కూర్చుంటుందేమోనని భయపడాలో అర్థంకాని పరిస్థితి. టీడీపీ ఒకటో రెండో గెలిస్తే ఓకే అనుకోవచ్చు… ఉత్తరాంధ్రలో మా మద్దతుతోనే అన్ని ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ రాయలసీమలోని రెండు గ్రాడ్యుయేట్ సీట్లను టీడీపీ గెలుచుకోవడంతో ఆ గెలుపు వెనక తమ పాత్ర ఉందని గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి జనసేనది. ఈ పరిణామాలు రేపు సీట్ల కేటాయింపులో తమ వాటాను తగ్గిస్తాయేమోనని ఆ పార్టీ టెన్షన్ పడుతోంది.
మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీకి బూస్ట్‌లా మారాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్లూ వీళ్లూ అనుకోవడం, ఆ సర్వేలు ఈ సర్వేలు చెప్పడం తప్ప ప్రజాభిప్రాయం నేరుగా ఎక్కడా ప్రతిబింబించలేదు. వైసీపీ చెబుతున్నట్లు అది ఓ వర్గం ఓట్లే అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. దీంతో ఓ ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయి.
టీడీపీ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలవకపోతే జనసేన పరిస్థితి వేరేగా ఉండేది. టీడీపీతో సీట్లపై గట్టిగా బేరసారాలు జరపగలిగేది. తాము అనుకున్న 30 సీట్లకు కాస్త అటూ ఇటుగా అయినా సంపాదించగలిగేది. కానీ ఇప్పుడు టీడీపీకి గంపగుత్తగా గ్రాడ్యుయేట్ ఓట్లు పడటంతో జనసేన గొంతులో వెలక్కాయ పడ్డట్లే కనిపిస్తోంది. మీరు కలసివస్తే ఓకే లేకపోయినా మా బలం ఇది అని చెప్పుకోవడానికి టీడీపీకి వీలుంటుంది. అదే జనసేనను కలవరపెడుతోంది. 20సీట్లు అన్న ప్రచారం ఎక్కడ నిజమవుతుందోనని జనసైనికులు కంగారెత్తిపోతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే జనసేన పిలుపునిచ్చింది. తమ మిత్రపక్షం బీజేపీకి ఓటేయాలని ఎక్కడా చెప్పలేదు. దీంతో ఉత్తరాంధ్రలో జనసైనికులు బీజేపీకి ఓటేయకుండా టీడీపీకే గుద్దారు. దీంతో కొంతమేర టీడీపీ గెలుపులో జనసేనకూ పాత్ర ఉంది. అయితే అంత మెజారిటీ తమదే అని జనసేన చెప్పుకునే పరిస్థితి లేదు. రాయలసీమలో జనసేన ప్రభావం అంతంతమాత్రమే. అది ఆ పార్టీకి కూడా తెలుసు. అక్కడ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. దీంతో తమ ప్రమేయం లేకుండానే టీడీపీ గెలిచినట్లైంది. ఇది ఓటర్లలో ఓ వర్గమే అయినప్పటికీ తేలిగ్గా తీసిపారేయడానికి లేదని జనసేనకు తెలుసు. ఆ విజయాన్ని తక్కువ చేయలేమనీ తెలుసు.
ఇప్పుడు జనసేన ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగా పోటీ చేసే నెగ్గే సత్తా ఆ పార్టీకి లేదు. పోతేపోనీ అని అనుకుంటే పార్టీకి దెబ్బ. అలాగే అది వైసీపీకి మేలు చేస్తే పార్టీని కాపాడుకోవడం కష్టమే. కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోకతప్పదు. కాబట్టి సాధ్యమైనని సీట్లను ఎలా రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేయక తప్పదు.