MLC KAVITHA: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్లమెంటుకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచే ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత 2019లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయింది. అనంతరం కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది.
REVANTH Vs KTR: అసెంబ్లీ సమావేశాలు.. సభలో ఎవరిది పైచేయి..?
అప్పటినుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవిత మళ్లీ నిజామాబాద్ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తోంది. అయితే, ఇప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 సమయంలోనే కవితపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండేవారు. కానీ, వాళ్లు కవిత రాజకీయ పెత్తనాన్ని భరించలేక, అంటీముట్టనట్లుగా ఉండటం వల్లే ఓడిపోయారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గెలవని కవిత.. ఇప్పుడు గెలుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. ఇప్పుడు నిజామాబాద్ పరిధిలోని బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూరులో బీఆర్ఎస్ ఓడిపోయింది.
అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ ఆధిపత్యం తక్కువే. బీఆర్ఎస్ గెలిచిన చోట్ల కూడా కాంగ్రెస్‌కు మంచి ఓటింగ్ శాతమే దక్కింది. అయితే, గతంలో ఓడిపోయిందనే సానుభూతి, ప్రస్తుత ఎంపీ అర్వింద్‌పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తాయని బీఆర్ఎస్ నమ్ముతోంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఇదే జరిగితే.. బీఆర్ఎస్ అభ్యర్థులు, కవిత గెలుపు అంత ఈజీ కాదు. ఇంతకీ కవిత.. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా.. లేదా.. మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఏప్రిల్, మేలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.