MEKA SHARAN: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు మేక శరణ్ కోసం వెతుకుతున్నారు. సౌత్ లాబీ డబ్బుల లావాదేవీల్లో మేక శరణ్ కీలకంగా వ్యవహరించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆయన వివరాలు చెప్పాలని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. అయినా ఆమె వివరాలు చెప్పడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అనూహ్యంగా కొత్త పేరు బయటకు వచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసులో ఈడీ అధికారులు అఫిడవిట్ ఫైల్ చేశారు.
MLC KAVITHA: ఈడీ ఆఫీస్‌లో కొడుకును చూసి.. కన్నీళ్లు ఆపుకోలేపోయిన కవిత..
ఈ అఫిడవిట్‌లో కొత్తగా మేకా శరణ్ పేరు ప్రస్తావించారు. సౌత్ లాబీ లావాదేవీల్లో మేకా శరణ్ ప్రమేయం ఉన్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. శరణ్.. కవితకు అత్యంత సమీప బంధువు అని తెలుస్తోంది. మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు అతను అక్కడే ఉన్నాడని తెలిపారు. అలాగే అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మేకా శరణ్‌ను తాము రెండుసార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు వివరించారు. హైదరాబాద్‌లో శనివారం కవిత ఆడబిడ్డ అఖిలతో పాటు మరికొందరి ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు.
మేకా శరణ్‌ను పట్టుకొని అరెస్ట్ చేస్తామని ఈడీ అధికారులు చెబుతున్నారు. దీంతో గతంలో ఎక్కడా వినపడని కొత్త పేరు ఇప్పుడు తెరమీదకు వచ్చింది. కవితకు మేకా శరణ్ బినామీగా వ్యవహరించాడా.. సౌత్ లాబీలో డబ్బుల పంపకంలో శరణ్ ఎలా కీలకంగా వ్యవహరించాడు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది.