దేశంలో అన్ని రాష్ట్రాల సమస్యలు ఒకలాగే ఉండవు.. కొన్ని రాష్ట్రాలకు తిండి సమస్య..కొన్ని రాష్ట్రాలకు నీటి సమస్య..మరికొన్ని రాష్ట్రాలకు ఉద్యోగాల సమస్య.. ఇలా ఒక్కొ రాష్ట్రానికి సమస్యలు వేరువేరుగా ఉంటాయి. అయితే బీజేపీ చేసే ప్రచారం మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తరహాలో ఉంటుంది.ఎంత సేపు మతాలు, సరిహద్దు గొడవలు, చైనా, పాకిస్థాన్ అంటూ ప్రతీచోటా చెప్పిన సోదే చెబుతుంటుంది. ఇదే ఫార్ములాతో ఏదో ఫ్లూక్‌లో కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించింది కానీ.. అందరూ అదే ట్రాప్‌లో పడిపోతారనుకుంటే ఎలా..? కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటమికి బుర్ర తక్కువ ప్రచారాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. అందులోనూ మోదీ చేసిన ప్రచారాలే కొంపముంచయంటున్నారు విశ్లేషకులు.
అయ్యా.. అన్నీ చోట్లా అదే చెబుతావా?
‘కర్ణాటక ఎన్నికలకు ఎన్‌ఆర్‌సీకి సంబంధమేంటి సారూ’? ఇప్పుడు ఇదే ప్రశ్న కర్ణాటక బీజేపీ కార్యకర్తల నోట వినిపిస్తుంది. అధికారంలోకి వస్తే ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తామని కేంద్ర పెద్దలు చెప్పడం అక్కడి కార్యకర్తలకు కూడా రుచించలేదు..ఎందుకంటే ఆ ఎన్‌ఆర్‌సీ అంశంలో ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదని వాళ్లకి తెలుసు. అయితే ఈసారి ఎన్నికల ప్రచారం స్క్రిప్ట్ ఎవరూ రాసినట్లు లేరు.. అందుకే ఇతర రాష్ట్రాల్లో చదివిన పాత స్క్రిప్ట్‌లనే మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ చదివి చిరాకు తెప్పించారు. కొత్తగా ‘ద కేరళ స్టోరీ’ సినిమాను ప్రచారంలో యాడ్‌చేశారు. అది కూడా బెడిసికొట్టింది. ఆ సినిమాకు కర్ణాటక ప్రజలకు సంబంధమేముంది?
ఇక్కడ కూడా ముస్లింలను చూపించి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం అది. అంతేకానీ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో బీజేపీ చేసిన అభివృద్ధి గురించి మాత్రం మోదీ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎంత సేపు నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం.. ‘జై బజరంగబలి’ అనడం.. ‘ద కేరళ స్టోరీ’ అందరూ చూడాలంటూ సినిమాలకు రివ్యూలు ఇవ్వడంతోనే ఆయన ప్రచారం ముగిసిపోయింది.
కాంగ్రెస్ మాత్రం పక్కా ప్లాన్:
మరోవైపు కాంగ్రెస్ మాత్రం పూర్తిగా ప్రాంతీయతపై దృష్టి పెట్టింది. నీళ్లు, నిధుల గురించి మాట్లాడింది. అధికారంలోకి వస్తే ఇలా అభివృద్ది చేస్తాం..అలా చేస్తామంటూ ప్రజలను నమ్మించగలిగింది. దేశ సమస్యల గురించి, దేశభక్తి జోలికి పోనేలేదు. ఎందుకంటే కన్నడిగుల నాడి ఎప్పుడూ సొంత రాష్ట్రంపైనే ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల గురించి చర్చ వాళ్లకి అనవసరం. అందులోనూ ఉత్తరాది రాజకీయాలంటే వాళ్లకి పట్టరని కోపం! ఉత్తరాది నాయకులు దేశాన్ని పాలించడం వల్లే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వాదించేవాళ్లలో కన్నడిగులు కూడా ముందువరసులో ఉంటారు. అలాంటి ప్రజల నాడి పట్టలేని మోదీ..దేశాన్ని ఉద్ధరించే మాటలే చెప్పారు కానీ కర్ణాటకకు ప్రత్యేకించి ఏం చేస్తారో చెప్పనేలేదు! అందుకే ఈ ఘోర పరాజయం కారణం వెనుక మోదీ కూడా ఉన్నట్లే లెక్క.