Telangana BJP: బీజేపీలో లుకలుకలపై హైకమాండ్ సీరియస్‌.. నేతలు ఇప్పటికైనా మారతారా?

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అమిత్‌షా ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రతీవారం ఇక్కడి నుంచి నేతలను ఢిల్లీకి పిలిపించుకొని మరీ.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తెలంగాణలో ఎలక్షన్ ఇంచార్జిగా కూడా త్వరలో రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఇంత సీరియస్‌గా ఉంటే.. ఇక్కడి నేతలు మాత్రం ఎవరి దారి వారు అన్నట్లుగా కనిపిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 2, 2023 / 02:18 PM IST

అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు.. తెలంగాణ కమలం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. ఇవే పరిస్థితులు కొనసాగితే.. అధికారం సంగతి తర్వాత.. బీఆర్ఎస్‌కు కనీసం పోటీ ఇచ్చే సీన్ కూడా ఉండదు. తెలంగాణలో అధికారానికి దగ్గరగా ఉన్నామని భావిస్తున్న అధిష్టానానికి.. రాష్ట్ర నాయకుల వర్గపోరు తలపోటుగా మారింది. ముఖ్యంగా బండి సంజయ్ వర్గానికి దర్మపురి అరవింద్ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. కవిత వ్యవహారంలో మీడియా సాక్షిగా సంజయ్ వ్యాఖ్యలను ఖండించినప్పుడే వీరి మధ్య సఖ్యత లేదన్న వ్యవహారం బయటపడింది.

వీళ్ల ఇద్దరి సంగతి ఇలా ఉంటే.. చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కూడా అలక మీదే కనిపిస్తున్నారు. తన మాటను పార్టీలో కొంతమంది నేతలు లెక్కచేయడం లేదని.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని.. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. తనకు పదవి కూడా అవసరం లేదని ఖరాఖండీగా చెప్పేశారు. పార్టీలో పరిస్థితులు చేజారుతున్న వేళ.. బీజేపీ హైకమాండ్ అప్రమత్తం అయింది. పార్టీలో వర్గపోరును సెట్‌రైట్ చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బీజేపీ ముఖ్యులు అయిన బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్‌తో.. ఢిల్లీ పెద్దలు శివప్రకాష్, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ సంప్రదింపులు జరిపారు. రాష్ట్రనేతల సమస్యలను విన్న పెద్దలు.. కొన్ని పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌కు అమిత్‌షా మకాం మార్చబోతున్నారు. ఆ సమయానికి పార్టీలో ఏ చిన్న విభేదం కూడా లేకుండా చూడాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఒకరకంగా ఎన్నికల మూడ్ స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలో.. ఎవరి దారి వారిదే అంటే.. అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.