ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లభిస్తోంది. విజయవాడను భారీ వరదలు ముంచెత్తడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. రాష్ట్రానికి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇస్తోంది కేంద్రం. ఆదివారం వరదలు విజయవాడను ముంచెత్తిన దగ్గరి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన సాయాన్ని ఆలస్యం చేయకుండా చేస్తూ వచ్చారు. ముందు ముంపు బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ లు కావాలని అడగగా… సోమవారం ఉదయానికి హెలికాప్టర్ లు రంగంలోకి దిగాయి.
ఆ తర్వాతి నుంచి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరిన్ని విపత్తు నిర్వహణ బృందాలు కావాలని చంద్రబాబు కోరిన వెంటనే ఆలస్యం చేయకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పంపించారు. సాధారణంగా వరదలు వచ్చిన ప్రాంతాలకు కేంద్ర బృందాలు రావాలంటే… రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్రం నుంచి బృందాలు వచ్చి నష్టాలను పరిశీలించేవి. ఆ తర్వాత కొన్ని రోజులకు వస్తే కేంద్ర మంత్రులు వచ్చేవారు లేదంటే లేదు… వాళ్ళు చూసి వెళ్ళిన తర్వాత ఎప్పటికో నష్ట పరిహారం వచ్చేది.
కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అసలు విజయవాడలో వరదలు పోయిన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు అలాగే ఉంది. కాని కేంద్ర మంత్రి బృందం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో వరదనష్టాన్ని స్వయంగా పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ప్రత్యేక బృందం ముంపు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పర్యటించింది. రెండు మూడు వారాలకు వచ్చే కేంద్ర బృందం… నాలుగు రోజుల్లో విజయవాడ వచ్చింది.
కేంద్ర బృందం ఇచ్చే నివేదిక మీదనే వరద నష్టాన్ని రాష్ట్రాలకు ఇస్తారు. నివేదిక ఇస్తే ఆ తర్వాత నిధులు వస్తాయి. కాని నివేదిక వేగంగా ఇవ్వడంతో రాష్ట్రానికి వెంటనే సాయం అందే అవకాశం కనపడుతోంది. ఆదివారం వరద రావడం, బుధవారం కేంద్ర బృందాన్ని నియమిస్తూ ఉత్తర్వులు రావడం… గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రావడం జరిగాయి. ఇక స్వయంగా కేంద్ర మంత్రి చౌహాన్ ఏరియల్ సర్వే చేయడం, పంటలను పరిశీలించడం చేసారు. అలాగే బుడమేరుని, ప్రకాశం బ్యారేజ్ దెబ్బ తిన్న ప్రదేశాన్ని చూసారు. ఈ బృందమే నష్టంతోపాటు ఆనకట్ట నిర్వహణ, భద్రత తదితర అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని కేంద్రం బాధ్యతలు అప్పగించింది.