Karnataka: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్నాటక రాజకీయం భగ్గుమంటోంది. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దేనికైనా రెడీ అంటున్నాయి. దీంతో నోట్ల వరద పారుతోంది కర్నాటకలో. అనేక చోట్ల భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.
ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమాచారంతో ఐటీ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఓ రాజకీయ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు.
బెంగళూరు, మైసూరులోని బడా ఫైనాన్షియర్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 15 కోట్ల రూపాయల నగదు, 5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం సీజ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులకు.. ఈ ఫైనాన్షియర్లంతా ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. శాంతినగర్, సదాశివ నగర్, శివాజీనగర్‌లో ఈ దాడులు కొనసాగాయి. ఈ నెల 10న కర్నాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడే నగదు ఈ రేంజ్‌లో దొరుకుతుంటే.. రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితి ఏంటా అని ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది.