CM KCR: గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు.. కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న బాధితులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామంటూ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌తో తలపడుతున్నారు. అయితే వీళ్ళే కాదు.. రక రకాల సమస్యలపై కేసీఆర్‌పై బాధితులు భారీగా నామినేషన్లు వేశారు.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 06:07 PM IST

CM KCR: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. తొమ్మిదిన్నరేళ్ళ BRS ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందంటూ రకరకాల సమస్యల బాధితులు ఈ నామినేషన్లు వేశారు. మొత్తం 127 మంది నుంచి 157 వరకు నామినేషన్లు దాఖలైనట్టు పోలింగ్ అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామంటూ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌తో తలపడుతున్నారు.

MLC KAVITHA: బీసీల సీట్లు అగ్రవర్ణాలకు అమ్ముకున్న కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత

అయితే వీళ్ళే కాదు.. రక రకాల సమస్యలపై కేసీఆర్‌పై బాధితులు భారీగా నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్, ప్రశాంత్ హిల్స్ ఫ్లాట్ల బాధితులు 100 నామినేషన్లు ఫైల్ చేశారు. 1980లో 460 ఎకరాల్లో 3 వేల ప్లాట్లను మధ్యతరగతి కుటుంబాలు కొన్నాయి. ధరణి వచ్చాక ప్రస్తుతం స్వాధీనంలో ఉన్న, కొనుగోలు చేసిన వారి పేర్లు కాకుండా.. 1980లో ఉన్న పట్టాదారుల పేర్లే చూపిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా.. ఎవరూ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమ సమస్యను అందరికీ తెలిపేందుకే పోటీ చేస్తున్నామన్నారు శంకర్ హిల్స్, ప్రశాంత్ హిల్స్ ప్లాట్ల బాధితులు. గజ్వేల్‌లో ఇల్లిల్లూ తిరిగి.. ధరణి అరాచకాలపై ప్రచారం చేస్తామంటున్నారు. అలాగే తమ సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగారు జగిత్యాలకు చెందిన చెరకు రైతులు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిపించాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

వీళ్ళతో పాటు కొందరు నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల సభ్యుల కూడా గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు వేశారు. వీళ్ళే కాకుండా ధరణి బాధితులు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు కూడా BRS ప్రభుత్వంపై ఆగ్రహంతో ఇండిపెండెంట్స్‌గా బరిలోకి దిగారు. గతంలో 2019లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కవితకు వ్యతిరేకంగా వందల సంఖ్యలో పసుపు రైతులు పోటీ చేశారు. పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీలోఉండటంతో నిజామాబాద్ నియోజకవర్గం దేశంలోనే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కూడా అత్యధికమంది అభ్యర్థులతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. ఇక్కడ సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు బాధితులు.