Gorantla Madhav: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గోరంట్ల వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందంటూ మాట మార్చేశారు. శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల మాట్లాడుతూ “2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చంద్రబాబు చస్తారు అంటూ వ్యాఖ్యానించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గోరంట్ల తన మాటలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్ని టీడీపీ వక్రీకరించిందంటూ కొత్త రాగం అందుకున్నాడు. “2024 ఎన్నిక్లలో మళ్లీ జగన్ సీఎం అవుతారు.. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారు అనే ఉద్దేశంతోనే అలా మాట్లాడా. పద దోషంతో నేను మాట్లాడింది టీడీపీ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. వ్యాఖ్య నిర్మాణ లోపం వల్ల అలా మాట్లాడాను. నా వ్యాఖ్యల్ని టీడీపీ వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారనేదే నా ఉద్దేశం” అని గోరంట్ల అన్నాడు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ రాజకీయ సమాధి అవుతుందన్నారు. గోరంట్ల వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా నిరసనకు దిగాయి.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై ఒకపక్క ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే గోరంట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది. చంద్రబాబును జైలులోనే చనిపోతారని వైసీపీ నేతలు అంటున్నారని, ఆయన భద్రతపై ఆందోళనగా ఉందని ఇటీవల నారా లోకేష అన్నారు. చంద్రబాబుకు భద్రత కల్పించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తన భద్రత గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు ఇటీవలే జడ్జికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.